రోజాపై మంత్రి ఆది వివాదాస్పద వ్యాఖ్యలు

0adi-makes-controversial-comవైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన నంద్యాలలో మీడియాతో మాట్లాడారు. రోజాపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బట్టలు లేకుండా తిరిగే వాళ్లకు వస్త్రధారణపై మాట్లాడే అర్హత లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వస్త్రధారణపై రోజా మాట్లాడితే పిల్లలు కూడా నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. మంత్రి అఖిలప్రియపై రోజా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని, రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. వైసీపీ ఓటుకు రూ. 5 వేలు పంచినా చివరికి మాత్రం గెలుపు టీడీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి అఖిల ప్రియ చుడీదార్ వేసుకోవడంపై రోజా గతంలో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై గత కొద్ది రోజులుగా దుమారం చెలరేగుతోంది. రోజాపై తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు గత కొద్ది రోజులుగా తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఆదినారాయణ రెడ్డి రోజాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

2019 ఎన్నికల నాటికి ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. సాక్షి మీడియా జగన్ మానస పుత్రిక అంటూ మంత్రి మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చి నంద్యాలను అభివృద్ధి చేయడమనేది కలేనని ఆయన అన్నారు. ఏదిఏమైనా నంద్యాలలో గెలుపు టీడీపీదేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం ఆయన నంద్యాలలో మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎందుకు ఉరి తీయాలో, తుపాకీతో కాల్చాలో జగన్ చెప్పాలన్నారు. ఏపీ ప్రజల చిరకాల కోరిక అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినందుకా? లేక అనాధగా వదిలేసిన రాష్ట్రన్ని తన కాళ్ల మీద నిలబడేటట్లు చేసినందుకు చంద్రబాబును కాల్చాలా అని ఆయన అడిగారు.

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకొని ప్రజలను మోసం చేశారని, కోర్టులో అవినీతి అక్రమసంపాదనల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈ రోజు అవినీతి, మోసం గురించి మాట్లాడుతూంటే నవ్వొస్తుందని ఆయన అన్నారు.