గీత గోవిందం.. ఇంతకంటే ఏం కావాలి?

0‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న ‘గీత గోవిందం’పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. చిత్ర బృందం తమకు తాముగా ప్రమోషన్లు మొదలుపెట్టడానికి ముందే దీనికి మంచి హైప్ వచ్చేసింది. ‘ఇంకేం ఇంకేం కావాలే..’ పాట ఒక్కటే సినిమాకు కావాల్సినంత పాజిటివ్ బజ్ తీసుకొచ్చింది. ఇక ఈ చిత్ర ప్రోమోలన్నీ కూడా జనాల్లో అంచనాల్ని పెంచాయి. చివరికి ‘వాట్ ద ఎఫ్’ పాట తాలూకు వివాదం కూడా సినిమా పబ్లిసిటీకే ఉపయోగపడింది. రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. చిత్ర బృందం కూడా ప్రమోషన్ల జోరు పెంచడానికి చూస్తోంది. ఈ సానుకూలతలకు తోడు.. మంచి రిలీజ్ డేట్ ఎంచుకోవడం.. అసలు పోటీ అన్నదే లేకుండా పోవడం ‘గీత గోవిందం’కు మరింత సానుకూలంగా కనిపిస్తోంది.

ఈ వారాంతంలో విడుదలైన ‘శ్రీనివాస కళ్యాణం’.. ‘విశ్వరూపం-2’ చిత్రాలకు డివైడ్ టాక్ వచ్చింది. అవి వచ్చే వారం వరకు నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ముందు వారం వచ్చిన సినిమాల్లో ‘గూఢచారి’ మాత్రమే బాగా ఆడుతోంది. అది కూడా వచ్చే వారానికి జోరు తగ్గించేస్తుందనే భావిస్తున్నారు. ఇక ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజవుతుండటం ‘గీత గోవిందం’కు కలిసొచ్చే విషయం. దీనికి పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. ఒక్క నయనతార డబ్బింగ్ సినిమా ‘కో కో కోకిల’ మాత్రమే రిలీజవుతోంది. అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. స్వాత్రంత్య దినోత్సవ సెలవు కావడంతో బుధవారమే ‘గీత గోవిందం’ను రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ వీకెండ్లో సోలో బ్యాటింగ్ తో భారీగా వసూళ్లు రాబట్టుకునే అవకాశముంది. ప్రోమోలు చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా జనాల్ని ఆకట్టుకుంటుందనే అనిపిస్తోంది. మరి దీనికి టాక్ ఎలా ఉంటుందో చూడాలి.