కృష్ణాజలాలపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తెలంగాణ

0telangana-attened-to-the-coహైదరాబాద్‌: కృష్ణాజలాలపై తెలంగాణ మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కృష్ణా నీటి కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయంపై గతంలో కేంద్ర ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదుపై ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు పంపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో దరఖాస్తును దాఖలు చేసింది. 2015లో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌కు అనుబంధంగా ఈ దరఖాస్తు చేసిన తెలంగాణ, దీనిపై వెంటనే విచారణ చేపట్టి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ మేరకు రెండురోజుల క్రితం కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది.

బచావత్‌, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునళ్ల ఎదుట తన వాదనను వినిపించుకునే అవకాశం తెలంగాణకు లేకుండా పోయిందని, తెలంగాణ ప్రయోజనాలకు తగ్గట్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాదనలు వినిపించలేదని పేర్కొంటూ 2014 జులై 14న కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. నీటి కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి వీలుగా మొత్తం నీటిపై కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయడం లేదా ఉన్న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కే ఫిర్యాదును పంపాలని కోరింది. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో 2015 ఆగస్టు పదిన సుప్రీంకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేసి తమ ఫిర్యాదును ట్రైబ్యునల్‌కు పంపేలా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ కోరింది. అదే ఏడాది డిసెంబరులో కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో గడువు పొడిగించిన బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ పని ఇతర రాష్ట్రాలకు ఉన్న కేటాయింపుల జోలికి వెళ్లకుండా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయడమేనని పేర్కొంది. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీ కేటాయింపులు చేయడం, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు నిర్వహణ ఎలా అన్నది చెప్పడమే తన పరిధి అని 2016 అక్టోబరు 19న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ పేర్కొంది. తన విచారణ పరిధి నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలను తప్పించింది. ట్రైబ్యునల్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పి) దాఖలు చేయగా, దీనిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ఎస్‌ఎల్‌పీని రద్దు చేసినా తెలంగాణ దాఖలు చేసిన ఇతర పిటిషన్లపై ఈ ప్రభావమేమీ ఉండదని పేర్కొంది. మరోవైపు ట్రైబ్యునల్‌ ఏయే అంశాలపై విచారణ చేపట్టాలో నిర్ణయించింది. రెండు రాష్ట్రాలు తమ వాదనలు, ప్రతివాదనలు దాఖలు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ జరుగుతుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ తాజాగా సుప్రీంకోర్టులో మరో దరఖాస్తు దాఖలు చేసింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం తెలంగాణకు జరిగిన అన్యాయం సరిదిద్దడం వీలుకాదని, ఉన్న ప్రాజెక్టుల్లో ఆదా అయిన కొంతనీటిని తెలంగాణ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేటాయించడం కాదని. బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలను భాగస్వాములుగా చేర్చి తమ ఫిర్యాదును విచారించాలని పేర్కొంది. 2014 జులైలో తాము ఇచ్చిన ఫిర్యాదును ట్రైబ్యునల్‌కు పంపేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది.