ఎయిర్‌సెల్‌ రెండు సరికొత్త ప్లాన్స్‌

0Aircelరిలయన్స్‌ జియోకు టెలికాం కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి బాగానే కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించాయి. తాజాగా ఎయిర్‌సెల్‌ కంపెనీ కూడా జియోకు కౌంటర్‌గా, అది ఆఫర్‌ చేసే దానికంటే రెండింతలు ఎక్కువ డేటాతో రెండు సరికొత్త ప్లాన్స్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లలో రోజుకు 2జీబీ డేటాను, అపరిమిత కాల్స్‌ను 84 రోజుల పాటు ఎయిర్‌సెల్‌ అందించనుంది. జియో ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ కింద అందించే రూ.399 ప్లాన్‌కు సమానమైన వాలిడిటీలో ఈ ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అవి ఒకటి ఈశాన్య దేశ ప్రజలకు రూ.419 ప్లాన్‌. మరొకటి జమ్మూకశ్మీర్‌ ప్రాంత ప్రజలకు రూ.449 ప్లాన్‌. అంతేకాక జమ్మూకశ్మీర్‌ సర్కిల్‌కు మరో ప్లాన్‌ రూ.229ను కూడా ఎయిర్‌సెల్‌ ఆవిష్కరించింది.

ఈశాన్య దేశ ప్రజలకు ఎయిర్‌సెల్‌ అందించే రూ.419 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ కింద రోజుకు 2జీబీ డేటా చొప్పున 84 రోజుల పాటు 168 జీబీ డేటాను వాడుకోవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ ఫ్రీ కాల్స్‌ను ఈ ప్యాక్‌తో ఏ నెట్‌వర్క్‌కైనా చేసుకోవచ్చు. 3జీ లేదా 2జీ స్పీడులో ఈ ఇంటర్నెట్‌ను ఎయిర్‌సెల్‌ అందిస్తోంది. అదేవిధంగా జమ్మూకశ్మీర్‌ ప్రాంత ప్రజలకు అందించే రూ.449 ప్రీపెయిడ్‌ ప్యాక్‌లోనూ పైన పేర్కొన ప్రయోజనాలే అందుబాటులో ఉంటాయి. మరో ప్యాక్‌ రూ.229 కింద 84 రోజుల పాటు 84జీబీ డేటాను ఎయిర్‌సెల్‌ అందించనుంది. అంటే రోజుకు 1జీబీ డేటాను వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్టీడీ కాలింగ్‌ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. అయితే కేవలం ఎయిర్‌సెల్‌ నెట్‌వర్క్‌కు మాత్రమే కాల్స్‌ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ ప్లాన్‌ కూడా 3జీ లేదా 2జీ స్పీడులో అందుబాటులో ఉంటుంది.

తాము అందించే ఈ కొత్త ప్లాన్లు తమ కస్టమర్లు ముఖ్యంగా విద్యార్థులకు, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు రోజంతా కనెక్ట్‌ అయి ఉండటానికి ఉపయోగపడతాయని ఉత్తర భారత సర్కిల్‌ రీజనల్‌ మేనేజర్‌ హరీష్‌ శర్మ చెప్పారు. ఉన్నతమైన విలువలో అంతరాయం లేని ఇంటర్నెట్‌ సర్వీసులు పొందవచ్చని పేర్కొన్నారు. కాగ, జియో ఆఫర్‌ చేసే రూ.399 ప్లాన్‌ కింద 84 రోజుల పాటు 84జీబీ డేటా మాత్రమే వాడుకోవడానికి వీలుంటుంది. రోజుకు 2జీబీ డేటా కావాలంటే రూ.509తో రీఛార్జ్‌ చేయించుకోవాలి. కానీ దీని వాలిడిటీ 56 రోజులు మాత్రమే. ఇది ప్రస్తుతం ఎయిర్‌సెల్‌ అందిస్తున్న ప్లాన్ల కంటే కూడా 28 రోజులు తక్కువ.