ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు డేటా క్యారీ ఫార్వర్డ్‌ బంపర్‌ ఆఫర్‌

0airtel-postpaidరిలయన్స్‌ జియోకు గట్టిపోటీని ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. పోస్టుపెయిడ్‌ కస్టమర్లు ఒకవేళ నెలలో వాడుకోవాల్సిన డేటాను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతే దాన్ని వచ్చే బిల్లింగ్‌ సైకిల్‌లో వాడుకునేలా అవకాశం కల్పించింది. అంటే డేటా క్యారీ ఫార్వర్డ్‌ ద్వారా దీన్ని వచ్చే బిల్లింగ్‌ సైకిల్‌కు మార్చుకోవచ్చు. దీంతో డేటా సమయం అయిపోతుందనే బెంగ యూజర్లకు ఉండదు. ఆగస్టు 1 నుంచి ఈ డేటా క్యారీ ఫార్వర్డ్‌ సేవలను కంపెనీ ప్రారంభించనున్నట్టు ఎయిర్‌టెల్‌ చెప్పింది. మైఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా డేటాను ట్రాక్‌ చేసుకుని, వచ్చే బిల్లింగ్‌ సైకిల్‌కు ఫార్వర్డ్‌ చేసుకోవచ్చు. కస్టమర్లు తమ అకౌంట్‌పైన పలు పోస్టుపోయిడ్‌ కనెక్షన్లను తీసుకుని కూడా 20 శాతం వరకు ఖర్చును ఆదా చేసుకోవచ్చు. ఇలా అన్ని కనెక్షన్లకు డేటా ప్రయోజనాలను షేర్‌ చేసుకోవచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

అంతేకాక రూ.2000 కోట్ల ప్లాన్‌ను ప్రకటించింది. కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుచుకోవడం కోసం వివిధ డిజిటల్‌ ఆఫర్లను లాంచ్‌ చేయనున్నామని, వాటికోసం మూడేళ్లలో 2వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెడుతున్నట్టు పేర్కొంది. అదేవిధంగా ఈ ఏడాది చివరికల్లా దేశమంతటా వాయిస్‌ ఓవర్‌ ఎల్టీసీ సర్వీసులను లాంచ్‌ చేయనున్నట్టు తెలిపింది.

వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ సర్వీసుల ట్రయల్స్‌ 5 సిటీల్లో నడుస్తున్నాయని, ఏడాది చివరికల్లా దేశమంతా ఈ సర్వీసులను తీసుకొస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈవో గోపాల్‌ విట్టల్‌ చెప్పారు. రిలయన్స్‌ జియో మార్కెట్లోకి ప్రవేశించిన దగ్గర్నుంచి ఈ కంపెనీకి తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. తన కస్టమర్లను కాపాడుకోవడానికి ఎయిర్‌టెల్‌ పలు ఆఫర్లను సైతం ప్రవేశపెడుతోంది. జియో దెబ్బకు ఈ కంపెనీకి నష్టాలు సైతం వాటిల్లుతున్నాయి. కానీ జియోకు గట్టి బదులు ఇచ్చేందుకు ఎయిర్‌టెల్‌ సిద్ధమైంది. ప్రాజెక్ట్‌ నెక్ట్స్‌లో భాగంగా ఎయిర్‌టెల్‌ తన ఇన్‌-స్టోర్‌ అనుభవాన్ని మెరుగుపరుచుకోనుంది. దేశమంతటా ఉన్న 2500కి పైగా స్టోర్లను రీడిజైన్‌ చేయనుంది. అంతేకాక ప్లాన్లను మార్చుకోవడానికి కస్టమర్లకు మైఎయిర్‌టెల్‌యాప్‌ కొత్తవెర్షన్‌ను ఆవిష్కరించింది.