ఎయిర్‌టెల్‌ లాభం 75% డౌన్‌

0airtel-logoదేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్‌టెల్‌కు రిలయన్స్‌ జియో ఉచిత, చౌక టారిఫ్‌ల సెగ తీవ్రంగా తగులుతోంది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో(2017–18) ఏకంగా 75 శాతం దిగజారి రూ.367 కోట్లకు పడిపోయింది. గడిచిన 18 త్రైమాసికాల్లో ఇదే అత్యంత తక్కువ లాభం కావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం రూ.1,462 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ.21,958 కోట్లకు తగ్గింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ.25,546 కోట్లతో పోలిస్తే 14 శాతం క్షీణించింది. కాగా, క్యూ1లో ఎయిర్‌టెల్‌ రూ.300 కోట్ల నికర లాభాన్ని, రూ.21,975 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేశారు.

సీక్వెన్షియల్‌గా స్వల్ప తగ్గుదలే…

గతేడాది సెప్టెంబర్‌లో రిలయన్స్‌ జియో అధికారికంగా టెలికం సేవలను ఆరంభించింది. అప్పటినుంచీ ఈ ఏడాది మార్చి వరకూ ఉచితంగానే సేవలందిస్తూ వచ్చింది. ఏప్రిల్‌ నుంచి మాత్రమే బిల్లింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, జియో దెబ్బకు ఎయిర్‌టెల్‌ సహా ఇతర టెల్కోలు కూడా చౌక టారిఫ్‌లను ప్రకటించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌లో సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన (గతేడాది చివరి క్వార్టర్‌ డిసెంబర్‌–మార్చి) చూస్తే… లాభాల్లో క్షీణత చాలా స్వల్పంగానే నమోదు కావడం గమనార్హం. మార్చి క్వార్టర్‌లో లాభం రూ.373 కోట్లతో పోలిస్తే.. స్వల్పంగా 1.7 శాతం మాత్రమే తగ్గింది.

‘కొత్త టెలికం ఆపరేటర్‌ (రిలయన్స్‌ జియో) ఎంట్రీ తర్వాత భారతీయ టెలికం మార్కెట్లో నెలకొన్న పోటాపోటీ టారిఫ్‌ల కోత, ఉచిత ఆఫర్లతో టెలికం కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అదేవిధంగా వార్షికంగా కంపెనీల ఆదాయంలో 15 శాతం మేర తగ్గుదల కారణంగా లాభదాయకత, నగదు ప్రవాహాలతో పాటు రుణాల విషయంలో కూడా మరింత ఒత్తిడికి దారితీసే అవకాశం ఉంది’ అని భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్‌ విట్టల్‌ పేర్కొన్నారు.

కొత్త ఆపరేటర్‌(జియో) చౌక టారిఫ్‌ల కారణంగా దేశీ మొబైల్‌ మార్కెట్‌ ప్రస్తుత క్వార్టర్‌(జూలై–సెప్టెంబర్‌)లో కూడా తీవ్ర కుదుపులతోనే కొనసాగనుందని చెప్పారు. కాగా, తాజాగా రిలయన్స్‌ జియో.. ఫీచర్‌ ఫోన్‌ కస్టమర్లను తనవైపు తిప్పుకోవడానికి ఉచితంగా జియో ఫోన్‌ను(మూడేళ్ల తర్వాత తిరిగిఇచ్చేవిధంగా రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో) ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీ టెలికం మార్కెట్లో పోటీ మరింత తీవ్రతరం కావచ్చని పరిశీలకులు చెబుతున్నారు.

ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ…

♦ స్పెక్ట్రం సంబంధిత వడ్డీ వ్యయాలు పెరిగిపోవడంతో క్యూ1లో నికర వడ్డీ వ్యయం రూ.1,631 కోట్ల నుంచి రూ.1,789 కోట్లకు ఎగసింది.

♦ ఇక భారత్‌ వ్యాపారం విషయానికొస్తే.. మొత్తం ఆదాయం 10 శాతం క్షీణించి రూ.17,244 కోట్లకు పడిపోయింది. ప్రధానంగా మొబైల్‌ సేవల విభాగంలో ప్రతికూల పనితీరు దీనికి దారితీసింది.

♦ మొత్తం కస్టమర్ల సంఖ్య 9.7 శాతం పెరుగుదలతో జూన్‌ చివరినాటికి 28 కోట్లకు చేరింది.

♦ ఒక్కో యూజర్‌ నుంచి సగటు నెలవారీ ఆదాయం(ఏఆర్‌పీయూ) 21 శాతం తగ్గుదలతో రూ.154కు పడిపోయింది. క్రితం ఏడాది క్యూ1లో ఏఆర్‌పీయూ రూ.196గా నమోదైంది.

♦ ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌లో సగటు నెలవారీ డేటా వినియోగం మూడురెట్లు ఎగబాకి 2,611 మెగాబైట్లకు(దాదాపు 2.5 జీబీ) చేరింది. క్రితం ఏడాది జూన్‌ క్వార్టర్‌లో ఇది 904 మెగాబైట్లు మాత్రమే. అయితే, డేటా సేవల నుంచి ఏఆర్‌పీయూ 22.7 శాతం పడిపోవడం గమనార్హం.

♦ కన్సాలిడేటెడ్‌ నిర్వహణ లాభం సీక్వెన్షియల్‌గా 2.1 శాతం క్షీణించి రూ.7,823 కోట్లుగా నమోదైంది.

♦ ఆఫ్రికా వ్యాపారం మొత్తం ఆదాయం సీక్వెన్షియల్‌గా(మార్చి క్వార్టర్‌తో పోలిస్తే) క్యూ1లో 3.8 శాతం తగ్గి… రూ.4,853 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం మాత్రం 4.2 శాతం వృద్ధితో రూ.1,362 కోట్లకు చేరింది.

♦ కంపెనీ మొత్తం రుణ భారం మార్చి క్వార్టర్‌తో పోలిస్తే (రూ.91,400 కోట్లు) జూన్‌ క్వార్టర్‌లో(సీక్వెన్షియల్‌గా) 3.9 శాతం తగ్గింది. రూ.87,840 కోట్లుగా నమోదైంది.

♦ ఇక కంపెనీ పెట్టుబడులు క్యూ1లో 73 శాతం వృద్ధితో రూ.6,586 కోట్లకు చేరాయి.

♦ బీఎస్‌ఈలో మంగళవారం ఎయిర్‌టెల్‌ షేర్‌ ధర 1.76 శాతం లాభంతో రూ.428 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి.