ఆరెక్స్ 100 డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా!

0తక్కువ బడ్జెట్ లో తీసినా పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కలెక్షన్లతో అదరగొడుతున్న ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డిమాండ్ మామూలుగా లేదు. ఎంత బడ్జెట్ డిమాండ్ చేసే కథ అయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ నిర్మాతల నుంచి ఫోన్ కాల్స్ రావడం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పెద్ద బ్యానర్లతో పాటు సక్సెస్ కోసం మొహం వాచిపోయిన హీరోలు బలమైన మధ్యవర్తిత్వం ద్వారా కబురు పెడుతున్నారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం గోదావరితో పాటు కృష్ణా జిల్లాల్లో ఆరెక్స్ ప్రమోషన్ కోసం థియేటర్ల టూర్ లో బిజీగా ఉన్న అజయ్ భూపతి మరో నెల రోజుల దాకా వీటి గురించి నేరుగా స్పష్టత ఇచ్చే అవకాశం లేదు. కానీ ఈలోపు దీని తాలూకు రకరకాల ఊహాగానాలు మాత్రం బాగా చెలరేగుతున్నాయి. అందులో కొన్ని నిజమయ్యే అవకాశాలు కనిపిస్తుండగా మరికొన్ని మాత్రం కొత్త సందేహాలు రేపుతున్నాయి.

విశ్వసనీయ సమాచారం మేరకు అజయ్ భూపతి రెండు బ్యానర్లకు సానుకూలంగా స్పందించాడట. అందులో ఒకటి భవ్య క్రియేషన్స్. చాలా కాలం నుంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కోసం అజయ్ భూపతితో ఒక మంచి యాక్షన్ బేస్డ్ మూవీ చేయించాలనే దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మరో బ్యానర్ ఎకె ఎంటర్ టైన్మెంట్స్. దాని అధినేత అనిల్ సుంకర సంప్రదింపుల ద్వారా పాజిటివ్ సిగ్నల్ తెచ్చుకున్నట్టు తెలిసింది. అయితే ఇందులో హీరో ఎవరు ఉండొచ్చు అనే లీక్ మాత్రం బయటికి రాలేదు. ఇవి కాకుండా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ బ్యానర్ కోసం లాక్ చేసినట్టుగా మరో వార్త బలమైన సోర్స్ నుంచే వస్తోంది. మొత్తానికి ఒక్క సినిమాతో తన డిమాండ్ అమాంతం పెంచుకున్న అజయ్ భూపతి స్వయంగా చెప్పే దాకా వీటిలో ఏది మొదట ఉండబోతోంది అనేది సస్పెన్సే . ఆరెక్స్ 100 బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా స్ట్రాంగ్ గానే ఉండటంతో మరో రెండు వారాలు ప్రమోషన్ చేసే పనిలో ఉంది యూనిట్. అప్పటి దాకా క్లారిటీ రావడం కష్టమే.