సుధీర్ బాబు ఆ హిట్ మిస్సయ్యాడా?

0ఒకరి కోసం అనుకున్న కథ ఇంకో హీరో దగ్గరికి చేరడం మామూలే. కొన్నిసార్లు అలా మిస్సయిన కథలే సూపర్ హిట్టయి.. ఆ హీరోలు చింతించేలా చేస్తుంటాయి. కొన్ని కథలు తుస్సుమనిపించి వద్దన్న హీరోలు ఊపిరి పీల్చుకునేలా చేస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాను ఒకరికి ఇద్దరు హీరోలు మిస్సయినట్లు తెలుస్తోంది. అందులో ఒకరు విజయ్ దేవరకొండ అన్న సంగతి స్వయంగా దర్శకుడే చెప్పేశాడు. ఐతే ‘అర్జున్ రెడ్డి’ తర్వాత తన ఇమేజ్ మారిపోయిన నేపథ్యంలో తనకు ఆ సినిమా సూటవ్వదని మర్యాదపూర్వకంగానే చెప్పేశాడు విజయ్. ఐతే మరో హీరో కూడా ఈ సినిమాకు నో చెప్పాడట. అతను.. సుధీర్ బాబు అని అంటున్నారు. ఐతే సుధీర్ ముందు ఆసక్తి చూపించినప్పటికీ ఆ తర్వాత ఈ సినిమాకు నో చెప్పాడట.

ఐతే సుధీర్ బాబు నటించి ఉంటే ‘ఆర్ ఎక్స్ 100’ ఎలా ఉండేదో చెప్పలేం. నిజానికి అతడి ఇమేజ్ కు ఇది సూట్ కాకపోయి ఉండొచ్చు. అతను మొదట్నుంచి కొంచెం సాఫ్ట్ టచ్ ఉన్న పాత్రలే చేస్తున్నాడు. కార్తికేయ మాదిరి ఏ మొహమాటం లేకుండా బోల్డ్ సీన్స్ చేయగలిగేవాడా అంటే డౌటే. ఎంతైనా మహేష్ బావ కాబట్టి ఇలాంటి సన్నివేశాలకు ధైర్యం చేయలేడు. కథను కూడా మరీ ఇంత బోల్డ్ గా చూపించడానికి అభ్యంతరం చెప్పి ఉండొచ్చు. ఎలాంటి బ్యాగేజ్ లేని హీరో ఈ సినిమా చేయడమే కరెక్ట్ అని చెప్పొచ్చు. ‘ఆర్ ఎక్స్ 100’ రావడానికి కొన్ని రోజుల ముందే సుధీర్ బాబు ‘సమ్మోహనం’ రిలీజైంది. అది సుధీర్ కు చాలా మంచి పేరు తెచ్చింది. నటుడిగా అతడికి ఇది మైలురాయి లాంటి సినిమానే అని చెప్పాలి. ‘ఆర్ ఎక్స్ 100’ చేసి ఉంటే కచ్చితంగా ‘సమ్మోహనం’ను అతను మిస్సయ్యేవాడే. కాబట్టి నిజంగా సుధీర్ ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేసి ఉంటే ఫీలవ్వాల్సిన పనేమీ లేదు.