అజిత్ తో అలాంటి సినిమానా?

0తమిళంలో రజినీకాంత్ తర్వాత అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకడు. అతను చూడ్డానికి చాలా క్లాస్ గా కనిపిస్తాడు కానీ.. ఎక్కువగా చేసేది మాత్రం మాస్ మసాలా సినిమాలే. వీరం.. వేదాళం.. వివేగం.. ఇలా అజిత్ గత కొన్నేళ్లలో చేసిన సినిమాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఈ మూడు సినిమాలు తీసిన శివ దర్శకత్వంలోనే అజిత్ ‘విశ్వాసం’ అనే మరో సినిమా చేస్తున్నాడు. ఇది కూడా ఊర మాస్ మూవీనే అంటున్నారు. అజిత్ అభిమానులు అతడి నుంచి ఆశించేది కూడా ఇలాంటి సినిమాలే. అలాంటి అజిత్ ఇప్పుడు తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన సినిమా చేయబోతున్నాడంటూ వార్తలొస్తున్నాయి. ‘విశ్వాసం’ తర్వాత ‘ఖాకి’ దర్శకుడు వినోద్ డైరెక్షన్లో అజిత్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే సమాచారం బయటికి వచ్చింది.

ఈ చిత్రం బాలీవుడ్లో కొన్నేళ్ల కిందట సూపర్ హిట్టయిన ‘పింక్’కు రీమేక్ అంటూ తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. అందులో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రలో అజిత్ కనిపిస్తాడట. తాప్సి క్యారెక్టర్లో ఓ యంగ్ హీరోయిన్ కనిపిస్తుందట. ఇది చాలా క్లాస్ గా సాగిపోయే కోర్ట్ రూం డ్రామా. కథాంశం ప్రకారం చూస్తే ఇది ఎంతమాత్రం అజిత్ ఇమేజ్ కు సరిపడనిదే. ఈ కథకు కొంచెం హీరోయిజం జోడించి.. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మారుస్తారని అంటున్నారు. ఎంత మార్చినప్పటికీ ఇలాంటి సినిమాలో అజిత్ అంటే వినడానికే ఏదోలా అనిపిస్తోంది జనాలకు. మరి ఇది కేవలం రూమర్ అనుకోవాలా.. లేక వినోద్ నిజంగానే ‘పింక్’ను అజిత్ తో రీమేక్ చేస్తున్నాడా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ‘ఖాకి’తో వినోద్ కు మామూలు పేరు రాలేదు. ఆ చిత్రం తమిళ.. తెలుగు భాషలు రెండింట్లోనూ సూపర్ హిట్టయింది. దీని కంటే ముందు అతను తీసిన ‘శతురంగ వేట్టై’ కూడా సూపర్ హిట్టే. అది తెలుగులోకి ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో రీమేకవుతోంది.