వర్మతో సినిమా గురించి అఖిల్

0ఆఫీసర్ ముందు వరకు వర్మ మీదున్న నమ్మకం గుడ్డి దీపంలాగా అలా అలా మిణుకు మిణుకు మంటూ ఉండేది. దాని డిజాస్టర్ ఫలితంతో అది కాస్త పూర్తిగా ఆరిపోయింది. ఎంతగా అంటే భవిష్యత్తులో మళ్ళి వెలుగుతుందా అని అనుమానం కలిగేంతగా. ఆఫీసర్ విడుదలకు ముందు వరకు అఖిల్ తో సినిమా చేయబోతున్నాను అని ప్రకటిస్తూ వచ్చిన వర్మ ఇప్పుడు ఆఫీసర్ ఫలితం చూసాక ఆ ప్రస్తావన ఎక్కడా తేవడం లేదు. మరోవైపు అఖిల్ కూడా దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి తో చేస్తున్న మూవీ గురించి తప్ప దేని మీద తనకు ధ్యాస లేదని అసలు ఏదీ ఒప్పుకోలేదని కుండ బద్దలు కొట్టేస్తున్నాడు. ఫాన్స్ పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా సినిమాలు చేయటం మీదే తన దృష్టి ఉందని వాళ్ళకు నచ్చే మంచి సినిమాలు ఇవ్వడమే తన ముందున్న లక్ష్యమని తేల్చి చెప్పేసాడు.

సో ఎలా చూసుకున్నా వర్మకు అఖిల్ సినిమా చేజారినట్టే. నిజానికి అక్కినేని అభిమానులు కోరుకుంటున్నది కూడా అదే. ఇప్పటికే మొదటి రెండు సినిమాలు సక్సెస్ కాక అఖిల్ ఇబ్బందుల్లో ఉంటే కోరి మరీ అఖిల్ నాలుగో సినిమా వర్మ చేతుల్లో పెట్టడం వాళ్లకు సుతరాము ఇష్టం లేదు. ఆఫీసర్ విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో నాగ్ ఫాన్స్ అఖిల్ తో వర్మ సినిమా లేకుండా చేయమని బ్రతిమాలుతు ఉన్నట్టుగా చేసిన కొన్ని ట్రాల్స్ వైరల్ కూడా అయ్యాయి. నాగ చైతన్యతో దర్శకత్వం వహించకపోయినా వర్మ నిర్మించిన బెజవాడ సినిమా ఫాన్స్ కి ఇంకా గుర్తుంది. సో అఖిల్ సినిమా మిస్ కావడం అంటే వర్మకు బ్యాడ్ లక్కేమో కానీ ఫాన్స్ కి మాత్రం గుడ్ న్యూస్. వెంకీ అట్లూరి సినిమా కోసం లండన్ వెళ్తున్న అఖిల్ దాని తర్వాత ఇంకా ఏది సైన్ చేయలేదు. దీనికి మిస్టర్ మజ్ను అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. యూనిట్ నుంచి అఫీషియల్ అప్ డేట్ రావాల్సి ఉంది.