ఐశ్వర్యా పక్కనా? అయితే వద్దు

0Aishwarya-Rai-Akshay-Oberoiఐశ్వర్యా రాయ్ అంటేనే నిలువెత్తు సౌందర్య సంతకం. అందుకే ఆమె పక్క హీరోగా నటించాలంటే సీనియర్ల నుంచి జూనియర్ల వరకు ఎగిరి గంతేస్తారు. ఆ మధ్య కెరీర్ లో కొంత గ్యాప్ తీసుకున్న ఈ నీలికళ్ల సుందరి ఏ దిల్ హై ముష్కిల్ సినిమాతో తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ పక్కన హీరోయిన్ గా నటించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది.

తాజాగా ఐశ్వర్య రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా సినిమా ఫ్యానీ ఖాన్ లో నటించేందుకు అంగీకారం తెలిపింది. ఇందులోనూ ఆమె ఓ యంగ్ హీరో తో కలిసి నటించనుంది. ఇందుకోసం ముందుగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తమ్ముడు అక్షయ్ ఒబెరాయ్ ను తీసుకుందామని ఫిలిం యూనిట్ అనుకుంది. కానీ అక్షయ్ ఒబెరాయ్ ఈ ఆఫర్ వద్దనుకున్నాడట. ఐశ్వర్య రాయ్ పక్కన నటించే అవకాశం వస్తే కాదనుకునే వారే ఉండరు. అలాంటిది ఈమధ్య సినిమాల్లోకి వచ్చిన హీరో కాదనుకోవడం ఏమిటా అని బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఇందుకు కారణం అక్షయ్ అన్నయ్య వివేక్ ఒబేరాయేనట. ఒకప్పుడు వివేక్ ఒబెరాయ్ – ఐశ్వర్య రాయ్ చెట్టపట్టాలేసుకుని తిరిగిన విషయం తెలిసిందే. తర్వాత వారిద్దరి మధ్య వ్యవహారం బెడిసికొట్టి ఐశ్వర్య అభిషేక్ కు దగ్గరై బచ్చన్ ఇంటి కోడలైంది.

తనను వద్దన్న ఐశ్వర్య పక్కన తన తమ్ముడు నటించడం ఏమిటి అనుకున్నాడో ఏమిటో కానీ వివేక్ ఒబెరాయ్ ఫ్యానీ ఖాన్ లో నటించకుండా అక్షయ్ ను అడ్డుకున్నాడు. దీంతో సినిమా యూనిట్ చేసేదేమీ లేక కొత్త హీరోను వెతుక్కునే పనిలో పడింది.