అవకాశం వస్తే ఆయనతో చేస్తా!

0Alia-bhatt-about-prabhasనాకు సౌత్‌లో నచ్చినోడు ప్రభాస్‌ అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌. సినీయర్‌ బాలీవుడ్‌ దర్శకుడు మహేశ్‌భట్‌ వారసురాలైన ఈ అమ్మడు దక్ష్మిణాదిపై కన్నేసినట్లుంది. బాలీవుడ్‌లో 2 స్టేట్స్‌ చిత్రంలో నటనకుగానూ అభినందనలతో పాటు అవార్డులను అందుకున్న అలియాభట్‌ ఖాతాలో హైవే, డియర్‌ జిందగీ, ఉడ్తాపంజాబ్‌ వంటి మంచి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు పడ్డాయన్నది తెలిసిందే. అలాంటి జాణ దృష్టి టాలీవుడ్‌ ఆరడుగుల అందగాడు ప్రభాస్‌పై పడినట్లుంది. బాహుబలి–2 చిత్రం తరువాత ప్రభాస్‌ క్రేజ్‌ టాలీవుడ్, కోలీవుడ్‌ దాటి బాలీవుడ్‌లో యమాగా పెరిగిపోయింది. ఆయనతో చిత్రాలు చేయడానికి బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు సైతం ఆసక్తి చూపుతున్నారు. ప్రభాస్‌ తాజాగా సాహో అనే భారీ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు.

ఈ బహుభాషా చిత్రంలో నటించడానికి కొందరు బాలీవుడ్‌ హీరోయిన్లను సంప్రదించగా కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా కొందరు, భారీ పారితోషికాలను డిమాండ్‌ చేసి కొందరూ ఈ లక్కీచాన్స్‌ మిస్‌ అయ్యారట. ఈ విషయం తెలిసిన నటి అలియాభట్‌ సౌత్‌లో తనకు నచ్చిన ఏకైక నటుడు ప్రభాస్‌ అని, ఆయనతో నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని తన సన్నిహితులతో చెప్పిందట. బాహుబలి–2 చిత్రం తాను చూశానని, బ్రహ్మాండంగా ఉందని కితాబిచ్చిందట. ఈ బాహుబలి–2 చిత్ర హిందీ హక్కులను పొందిన దర్శకుడు కరణ్‌ జోహార్‌నే నటి అలియాభట్‌ను నటిగా పరిచయం చేశారన్నది గమనార్హం. అయితే సాహో చిత్రంలో నటి అనుష్క సహా పలువురు నటీమణుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా అలియాభట్‌ తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తోంది. వీరిలో సాహోలో నటించే లక్కీచాన్స్‌ను పొందేదెవరో వేచి చూడాలి.