బాలీవుడ్ నటికి షాక్.. రెండేళ్ల జైలు ఖరారు

0Alka-Kaushal-and-her-motherఒక్కోసారి చిన్న విషయాలే మెడకు చుట్టుకుంటుంటాయి. అవి కోర్టుల వరకూ వెళ్లి జైలు శిక్ష ఎదుర్కొనే వరకు చేరుకుంటాయి. బాలీవుడ్ నటి అల్కా కౌశల్ కు ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ‘భజరంగి భాయిజాన్’లో కరీనా కపూర్ కు.. ‘క్వీన్’ చిత్రంలో కంగనా రనౌత్ కు తల్లిగా నటించిన అల్కాకు చెక్ బౌన్స్ కేసులో పంజాబ్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

సినిమాల కంటే ముందు అల్కా టీవీల్లో సూపర్ పాపులారిటీ సంపాదించింది. అనేక టాప్ సీరియళ్లలో నటించింది. అల్కా.. ఆమె తల్లి కలిసి అవతార్ సింగ్ అనే పరిచయస్థుడి దగ్గర సీరియల్ నిర్మాణం కోసం రూ.50 లక్షల అప్పు తీసుకున్నారు. ఐతే ఆ డబ్బు తిరిగివ్వమని అవతార్ డిమాండ్ చేయగా.. రూ.25 లక్షల చొప్పున రెండు చెక్కులు అందజేశారు. కానీ అవి బౌన్స్ కావడంతో అవతార్ సింగ్ కోర్టుకెక్కాడు. ఈ కేసును విచారించిన కింది కోర్టు అల్కాకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ 2015లో తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ అల్కా జిల్లా కోర్టులో అప్పీల్ చేయగా.. అక్కడా ఆమెకు ఊరట లభించలేదు. కింది కోర్టు తీర్పునే ఖరారు చేశారు న్యాయమూర్తి. అల్కా హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆమెకు ఊరట లభిస్తుందా అన్నది సందేహమే. ప్రముఖ టీవీ నటుడు వరుణ్ బడోలా కూతురైన అల్కా.. ఖుబూల్ హై.. స్వరంగిని లాంటి టాప్ సీరియళ్లతో మంచి పేరు సంపాదించింది.