మహేష్ సినిమాలో నరేష్.. ఇలా కన్ఫమ్ చేశారు

0హీరోగా 50కి పైగా సినిమాల్లో నటించాడు అల్లరి నరేష్. అతడి కెరీర్ ఒకప్పుడు మాంచి ఊపుమీద ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా అతడికి అస్సలు కలిసి రావడం లేదు. గత నాలుగైదేళ్లలో నరేష్ రెండంకెల సినిమాల్లో నటించాడు కానీ.. వాటిలో అన్నీ తుస్సుమనిపించినవే. హీరోగా అతడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందిప్పుడు. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాలో అతడికి ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం దక్కింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరేష్.. మహేష్ ఫ్రెండుగా రవి అనే పాత్రలో నటిస్తున్నాడు. ఐతే మహేష్ సినిమాలో నరేష్ నటిస్తున్నట్లు మీడియాలో వార్తలు రావడమే తప్ప.. ఇప్పటిదాకా ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ధృవీకరించలేదు.

ఐతే తాజాగా ఈ చిత్ర బృందం ఒక ఫొటో షేర్ చేయడం ద్వారా మహేష్ తో కలిసి నరేష్ నటిస్తున్న సంగతి నిజమే అని చెప్పకనే చెప్పింది. మొన్ననే నరేష్ తన పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆ సమయంలో మహేష్ సినిమా సెట్లోనే ఉన్నాడు నరేష్. దీంతో చిత్ర బృందం అతడి పుట్టిన రోజును ఘనంగా నిర్వహించింది. భారీ కేక్ తెప్పించి చిత్ర యూనిట్ మొత్తం పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా మహేష్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే.. దర్శకుడు వంశీ పైడిపల్లి.. నరేష్ తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలో నరేష్ తో పాటు అతడి కూతురు కూడా ఉండటం విశేషం. ఈ చిత్రంలో నరేష్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని.. అతడి కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకునేలా ఈ పాత్రను తీర్చిదిద్దారని అంటున్నారు. కొన్ని రోజుల కిందటే ఉత్తరాఖండ్ లో ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. దిల్ రాజు.. అశ్వినీదత్.. పీవీపీ ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.