చిక్కుల్లో పడిన వైసీపీ నేత

0Kakani-govardhan-reddy-picవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసన సభ్యుడు కాకాణి గోవర్దనరెడ్డి చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వేలకోట్ల ఆస్తులు కూడబెట్టారని, మలేషియా తదితర దేశాల్లో ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేస్తున్నారంటూ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

అంతేగాక, తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ కొన్ని పత్రాలను మీడియా సమావేశంలో చూపించి, ఈ అంశంపై ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేస్తానని కాకాణి చెప్పారు.

కాగా, ఆ తర్వాతి రోజే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాకాణి ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. పైగా ఆ పత్రాలన్నీ నకిలీవని చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కాకాణి వ్యవహార శైలిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని కోరుతూ నెల్లూరు రూరల్‌పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

డాక్యుమెంట్లను తయారు చేస్తూ రాజకీయ నాయకులను బుట్టలో వేసుకునే ఓ అంతరాష్ట్ర ముఠాను చిత్తూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు విచారణలో వారు తామే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణికి నకిలీ పత్రాలను ఇచ్చినట్లు నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం.

ఈ సంఘటనతో వారి బుట్టలోపడ్డ కాకాణి సమస్యల్లో చిక్కుకున్నట్లయ్యింది. ఈ కేసునకు సంబంధించి కాకాణిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ఆయన న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆయనకు షరతులు విధిస్తూ వెసులుబాటు కలిపించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు కాకాణి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిత్యం పోలీసుల విచారణకు హాజరై సంతకాలు పెట్టాల్సి ఉంది.

కొద్దిరోజుల పాటు ఈ ఉత్తర్వులను పాటించిన కాకాణి తర్వాత స్టేషన్‌కు వెళ్లి సంతకాలు పెట్టడాన్ని మానివేశారు. దీంతో పోలీసులు అరెస్టుచేసే అవకాశం ఉండటంతో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా తాజాగా సింగిల్ బెంచ్ ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.

ఈ క్రమంలో ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నప్పటికీ ఇతరులెవ్వరికీ అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు తెలిసింది. జిల్లా వైసీపీ అధ్యక్షులు అయినప్పటికి గత 15 రోజులుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో వైసీపీ నిర్వహిస్తున్న పలు సమీక్షలకు ఆయన హాజరు కాలేదని తెలిసింది.

ఇది ఇలా ఉండగా, నెల్లూరుకు వస్తే ఆయన్ని పోలీసులు అరెస్టు చేస్తారని ముందస్తు సమాచారం మేరకు కాకాణి జిల్లాకు రావట్లేదని టిడిపి వర్గీయులు ఆరోపిస్తుండటం గమనార్హం. కాకాణిని పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని వారంటున్నారు.