అది అల్లు అరవింద్ నిర్ణయమేనట

0విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన `గీత గోవిందం` విడుదలకి ముందు మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఆ ఊపులోనే ఆడియో వేడుకని జరిపి… విజయవంతంగా చిత్రాన్ని విడుదల చేసి హిట్టు కొట్టాలనుకుంది టీమ్. అయితే ఇంతలో అనుకోకుండా ఆ చిత్రాన్ని వివాదం చుట్టుముట్టింది. అయితే అది ఇంకాస్త ముదరకుండా అల్లు అరవింద్ స్వయంగా రంగంలోకి దిగారు. విజయ్ దేవరకొండ స్వయంగా పాడిన వాట్ ద ఎఫ్… పాట గురించే వివాదం క్రియేట్ అయింది. శ్రీమణి రాసిన ఆ పాటలో అభ్యంతరకరమైన పంక్తులు ఉన్నాయని – కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కూడా అందుకు సంబంధించి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఆ వివాదం ముదిరి పాకాన పడకముందే అల్లు అరవింద్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఆ పాటని యూ ట్యూబ్ నుంచి తొలగించేలా చేశారు. పాటలో ఉన్న పదాల్ని మార్చి మళ్లీ అప్ లోడ్ చేస్తామని చిత్రబృందంతో ప్రకటింపజేశారు. దాంతో వివాదానికి పుల్ స్టాప్ పడింది. లేదంటే మాత్రం వివాదం పెద్దదై – అది సినిమా విడుదలపై కూడా ప్రభావం చూపుండేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. చిత్రబృందం మాత్రం అల్లు అరవింద్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతోంది. “అల్లు అరవింద్ గారికి అనవసరమైన వివాదాలు నచ్చవు. ఎవరి మనోభావాలైనా దెబ్బ తింటాయని తెలిసినప్పుడు అలాంటి కంటెంట్ని ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించరు. ఆయనవల్లే వాట్ ద ఎఫ్… పాట వివాదం సద్దుమణిగింద“ని చిత్రబృందంలోని ఒకరు చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఆడియో కార్యక్రమం రేపు హైదరాబాద్ లో జరుగుతుంది. ఆగస్టు 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.