ఒక్క ఫ్లాపుతో పూర్తిగా మారిపోయిన బన్నీ

0అల్లు అర్జున్ కెరీర్ లో అసలు ఫ్లాపులే లేవని చెప్పాలి.. సినీ ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి సినిమాకో కొత్త ప్రయత్నం చేస్తూ అల్లు అర్జున్ అలరిస్తుంటాడు. బన్నీ సినిమాలంటే మినిమం యావరేజ్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రేక్షకులు కూడా ఈ హీరో సినిమాలకు ఎగబడుతుంటారు. బన్నీకి తెలుగులోనే కాదు మలయాళంలోనూ మంచి మార్కెట్ ఉంది. కానీ ఒక్క ఫ్లాప్ బన్నీలో ఇప్పుడు చాలా మార్పులు తీసుకొచ్చింది. ‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత బన్నీ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇది వరకూ అల్లు అర్జున్ కు అత్యంత సన్నిహితుడైన బన్నీవాస్ మొత్తం బన్నీ వ్యవహారాలు చూసేవాడని ఫిలింనగర్ లో చెప్పుకొంటారు. అయితే ఇప్పుడు ఇతను అల్లు కాంపౌండ్ కు సంబంధించిన గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ వ్యవహారాలతో బిజీగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ సహా చిన్న దర్శకులతో కొత్త కొత్త కాన్సెప్ట్ సినిమాలు తీస్తున్నాడు. అల్లు అరవింద్ బ్యాక్ బోన్ గా ఉంటూ బన్నీవాస్ తో కలిసి యువ దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీకి మరో కొత్త సన్నిహితుడు లభించాడని ఫిలింనగర్ నుంచి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇండస్ట్రీ వర్గాలలో ఇప్పుడు హడావుడి చేస్తున్న ప్రకారం బన్నీ దగ్గర ‘సాయి’ అన్న కొత్త వ్యక్తి చేరినట్టు తెలిసింది.

సాయి మంచి సినీ విశ్లేషకుడు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితుడు. త్రివిక్రమ్ సినిమా కథలను విని ఆ కథలోని విషయాన్ని పట్టుకోవడంతో నిష్ణాతుడు అని పేరు ఉంది. అయితే అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ కు సాయికు మధ్య విభేదాలు పొడచూపాయని ప్రచారం ఒకటి వచ్చింది. దీంతో ప్రస్తుతం సాయి… త్రివిక్రమ్ ను వీడి అల్లు అర్జున్ కాపౌండ్ లో చేరినట్టు వార్తలు లీక్ అయ్యాయి.. అల్లు అర్జున్ కొత్త సినిమాలకు కథలు వినడమే కాకుండా ఆ కథలను బన్నీకి వివరించడంలో ప్రస్తుతం సాయి అన్నీ తానై వ్యవహరిస్తున్నట్టు ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నారు. ఒక్క ఫ్లాప్ తో బన్నీలో చాలా మార్పులు వచ్చాయని.. అందుకే కథల ఎంపిక కోసం ఓ ఎక్స్ పర్ట్ ను పెట్టుకున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అధికారికంగా మాత్రం ఈ విషయంపై అల్లు అర్జున్ కానీ అల్లు కాంపౌండ్ కానీ స్పందించలేదు.