ప్రముఖ క్రికెటర్ గా అల్లు అర్జున్…!

0‘నా పేరు సూర్య’ విడుదలై నెలలు గడిచి పోతున్నా కూడా అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం విషయంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు. వరుసగా రెండు చిత్రాలతో నిరాశ పర్చిన అల్లు అర్జున్ తదుపరి చిత్రంతో ఖచ్చితంగా సక్సెస్ ను దక్కించుకోవాలనే పట్టుదలతో వెయిట్ అండ్ సీ అన్న దోరణిలో తన తదుపరి చిత్రంను వాయిదా వేస్తూ వస్తున్నాడు. ‘నా పేరు సూర్య’ చిత్రం సక్సెస్ అయితే వెంటనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక విభిన్నమైన – ప్రయోగాత్మక చిత్రాన్ని బన్నీ చేసేవాడు. కాని నా పేరు సూర్య చిత్రం తర్వాత ప్రయోగాన్ని చేసేందుకు బన్నీ భయపడుతున్నాడు. ఇటీవలే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం గుంరించి స్పందిస్తూ కాస్త ఆలస్యం అయినా ఖచ్చితంగా మంచి చిత్రంతో వస్తాను అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా ఈయనకు బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చినట్లుగా మెగా వర్గాల నుండి సమాచారం అందుతుంది.

అల్లు అర్జున్ తదుపరి చేయబోతున్న చిత్రం బాలీవుడ్ చిత్రం అంటూ మెగా ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే బాలీవుడ్లో బన్నీ చేయబోతున్న చిత్రం ఫుల్ లెంగ్త్ హీరో పాత్ర కాదని ఒక ప్రతిష్టాత్మక చిత్రంలో గెస్ట్ రోల్ అంటూ వారు అనధికారికంగా చెబుతున్నారు. ఇక సినీ వర్గాల్లో వినిపిస్తున్న పుకార్ల ప్రకారం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న కపిల్ బయోపిక్ చిత్రంలో బన్నీ కనిపించనున్నాడట. కపిల్ సారథ్యంలో ఇండియా ప్రపంచకప్ సాధించిన విషయం తెల్సిందే. ఆ నేపథ్యంలో సినిమా తెరకెక్కబోతుంది. కభీర్ ఖాన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కపిల్ దేవ్ గా రన్ వీర్ సింగ్ కనిపించబోతున్నాడు.

ప్రపంచకప్ గెలుచుకున్న టీం సభ్యులందరి పాత్రలను కూడా ప్రముఖ నటీనటులతో చేయించాలని దర్శకుడు కబీర్ ఖాన్ భావిస్తున్నాడు. అందులో భాగంగానే నిన్నటి తరం క్రికెటర్ శ్రీకాంత్ కృష్ణమాచార్య పాత్రకు గాను అల్లు అర్జున్ ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో బన్నీకి మంచి క్రేజ్ ఉంది. ఆ విషయం ఆయన సినిమాలు యూట్యూబ్ లో సాధించిన రికార్డుల ద్వారా తెలిపోయింది. అందుకే బన్నీ హిందీలో ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ ఎంట్రీ ఇలా ఇవ్వనున్నట్లుగా సమాచారం అందుతుంది. బన్నీ ఈ చిత్రంలో నటిస్తే తెలుగులో మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.