అరవింద్ మందు గ్లాసు అయాన్ చూసి..

0పిల్లల పెంపకం అన్నది కీలకమైన విషయం. వాళ్లను ఎలా పెంచుతాం.. ఎలాంటి అలవాట్లు నేర్పిస్తాం అన్నదాన్ని బట్టే పెద్దయ్యాక వాళ్ల వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో తమ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉంటుందని చెబుతున్నారు అల్లు అర్జున్ తల్లి నిర్మల. ఆదివారం మదర్స్ డే సందర్భంగా ఆమె బన్నీతో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లల పెంపకం గురించి ఆమె కీలకమైన విషయాలు చెప్పారు. అందుకు తమ ఇంటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. బన్నీ కొడుకు అయాన్ విషయంలో తాము ఎంత జాగ్రత్తగా ఉంటున్నది ఆమె వివరించారు.

ఒక సందర్భంలో అయాన్ ‘మా ఇంట్లో’ అన్నాడట. అలా అనకూడదని.. ‘మన ఇంట్లో’ అనాలి అని చెప్పారట నిర్మల. ఆ తర్వాత అయాన్ మరో సందర్భంలో‘మా ఇంట్లో’ అనబోయి.. ఆగి ‘మన ఇల్లు’ అని దిద్దుకున్నట్లు చెప్పారు. అలాగే చిన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే.. ‘నువ్వు గుడ్ బోయ్ కదా.. ఎందుకిలా చేశావ్’ అంటే.. పిల్లల మనసులో ‘మనం గుడ్ కదా.. చెడ్డ పనులు చేయకూడదు’ అనే ఆలోచన పెరుగుతుందని ఆమె అన్నారు.

ఇక తమ ఇంట్లో పార్టీలు జరిగినా.. ఎవరైనా మద్యం తాగినా అది పిల్లల కంట పడకుండా చూసుకుంటామని నిర్మల చెప్పారు. ఒక సందర్భంలో అల్లు అరవింద్ కొంచెం మద్యం తాగి వదిలేసిన గ్లాస్ టేబుల్ మీద పెట్టి మరచిపోయాడట. అయాన్ వచ్చి ఇదేంటి అని అడిగితే.. అది తాత జ్యూస్ నాన్నా అని చెప్పారట నిర్మల. ‘నీకెందుకు.. నువ్వు చూడకూడదు’ అని చెబితే క్యూరియాసిటీ పెరిగి దాని గురించి తెలుసుకోవాలనుకుంటారని.. చెడ్డ విషయాల గురించి తెలివిగా చెప్పడంవల్ల పిల్లలకు వాటి మీద క్యూరియాసిటీ పెరగకుండా చూసుకోవాలని నిర్మల సూచించారు.