స్టార్ డైరక్టర్లను లైన్లో పెట్టిన బన్నీ

0స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చినట్టే ఉన్నాడు. బన్నీ రీసెంట్ గా నటించిన దువ్వాడ జగన్నాథమ్ – నా పేరు సూర్య సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో తరవాత సినిమా ఎవరితో చేయాలన్న దానిపై కొద్ది కాలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త డైరెక్టర్లేవీ ఇంప్రెస్ చేసే కథలేవీ చెప్పకపోవడం.. పెద్ద డైరెక్టర్లంతా బిజీగా ఉండటంతో తరవాత సినిమాకు ఇంతవరకు కొబ్బరికాయ కొట్టలేదు.

దీనిపై కొంతకాలంగా డైలమాలో ఉన్న అల్లు అర్జున్ తరవాత సినిమా కూడా పెద్ద డైరెక్టర్లతోనే చేయాలని డిసైడయ్యాడు. ముందుగా విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్ లో సినిమా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం విక్రమ్ బన్నీకి తగిన సబ్జెక్టుతో కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. అది పూర్తయిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. సురేందర్ రెడ్డిలతోనూ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. వీళ్లిద్దరూ ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ అరవింద సమేత వీరరాఘవ తీస్తున్నాడు. సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో భారీ బడ్జెట్ చిత్రంగా సైరా.. నరసింహారెడ్డి సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు.

సురేందర్ రెడ్డి – త్రివిక్రమ్ లలో ముందు ఎవరు ఖాళీ అయితే వాళ్లతో సినిమా స్టార్ట్ చేసేందుకు బన్నీ సిద్ధంగానే ఉన్నాడు. అల్లు అర్జున్ ఇంతకుముందు వీళ్లిద్దరితో కలిసి పనిచేశాడు. త్రివిక్రమ్ తో జులాయి.. సన్నాఫ్ సత్యమూర్తి.. అలాగే సురేందర్ రెడ్డితో రేసుగుర్రం సినిమాల్లో హీరోగా నటించాడు. వీళ్ళలో ఎవరితో తన తదుపరి మొదలెడతాడో వేచి చూడాలి.