కాలేజీలో ఏబీసీడీ దిద్దుతున్నాడు

0స్కూల్లో కదా ఏబీసీడీల గొడవ. మరి కాలేజీలో ఏంటంటారా? ఇది అల్లు శిరీష్ సినిమా ముచ్చటండీ. మలయాళంలో విజయవంతమైన `ఏబీసీడీ` (అమెరికన్ బార్న్ కన్ ఫ్యూజ్డ్ దేశీ ) చిత్రం చూసి ఎంతో ఇష్టపడి దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు అల్లు శిరీష్. సంజీవ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం కళాశాల బ్యాక్ గ్రౌండ్ లో హీరోహీరోయిన్లు అల్లు శిరీష్ – రుక్సర్ మీర్ లపై కీలక సన్నివేశాల్ని తీర్చిద్దుతున్నారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన చిత్రమే `ఏబీసీడీ`.

ఇందులో హీరో ఫ్రెండ్ పాత్ర కూడా చాలా కీలకం. ఆ పాత్ర కోసం మొన్నటిదాకా బాలనటుడిగా అలరించిన భరత్ ని ఎంపిక చేసుకొన్నారు. రెడీలో చిట్టినాయుడుగా – పోకిరిలో ఇలియానా తమ్ముడిగా బొద్దుగా కనిపించిన బుడతడే భరత్. ఇప్పుడు స్లిమ్ అయిపోయి ఈ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమవుతున్నాడు. అమెరికాలో జులాయిగా తిరిగే ఇద్దరు తెలుగు కుర్రాళ్ల కథ ఇది. అక్కడ వీళ్ల అల్లరిని భరించలేక హీరో తండ్రి టూర్ కోసమని ఇండియా పంపిస్తాడు. ఆ తర్వాత వీళ్ల దగ్గరున్న క్రెడిట్ – డెబిట్ కార్డుల్ని బ్లాక్ చేస్తాడు. అప్పటిదాకా విలాస జీవితాన్ని గడిపిన ఈ ఇద్దరూ – చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఎలా జీవితాన్ని నెట్టుకొచ్చారనే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో ఏ రేంజిలో హిట్టు సాధిస్తుందో చూడాలి. శిరీష్ సరసన రుక్సర్ మీర్ నటిస్తోంది. నాని కృష్ణార్జున యుద్ధంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొంది రుక్సర్.