అల్లు శిరీష్ రెడీ..

0

మెగా ఫ్యామిలీ లాంటి పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినా.. హీరోగా నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు అల్లు శిరీష్. తొలి రెండు సినిమాలు తేడా కొట్టాక.. ‘శ్రీరస్తు శుభమస్తు’ అతడికి తొలి విజయాన్నందించింది. కానీ అతను ఆ విజయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మంచి అంచనాల మధ్య వచ్చిన శిరీష్ తర్వాతి సినిమా ‘ఒక్క క్షణం’ ఫ్లాప్ కావడంతో అతను పూర్వపు స్థితికి వెళ్లిపోయాడు. ఇప్పుడతను కొంచెం గ్యాప్ తీసుకుని ‘ఏబీసీడీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ఏబీసీడీ’కి ఇది రీమేక్. సంజీవ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. చడీచప్పుడు లేకుండా ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయిపోవడం విశేషం. ఇంకో పది రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలుందట. అమెరికాలో ఆ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.

‘ఏబీసీడీ’ టీం ఇప్పటికే ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటిస్తూ టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని 2019 ఫిబ్రవరి 8న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు. శిరీష్ ఇందులో అమెరికాలో చదువుకుని ఇండియాకు వచ్చిన పొగరుబోతు కుర్రాడిగా కనిపించనున్నాడు. బాగా యాటిట్యూడ్ ఉన్న పాత్ర అట అది. మలయాళంలో ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. అక్కడ దుల్కర్ సల్మాన్ చేసిన పాత్రను ఇక్కడ శిరీష్ చేస్తుండటం విశేషం. శిరీష్ కెరీర్ కు ఈ చిత్రం చాలా కీలకం కావడంతో గట్టిగా ప్రమోట్ చేసి సినిమాకు క్రేజ్ తీసుకురావాలని అనుకుంటున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. శిరీష్ సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఫేమ్ రుక్సార్ ధిల్లాన్ నటిస్తోంది. ఈ చిత్రంలో శిరీష్కు స్నేహితుడిగా మాస్టర్ భరత్ నటిస్తున్నాడు.
Please Read Disclaimer