ఈ సినిమా నిడివి 30రోజులు

030days Movieసాధారణంగా ఓ సినిమా నిడివి ఎంత సమయం ఉంటుంది? సుమారు రెండు నుంచి రెండున్నర గంటలు. కొన్ని సినిమాలు కథను బట్టి మూడు గంటల నిడివితో కూడా వస్తుంటాయి. వాటికే చాలామంది ప్రేక్షకులు అంతసేపా! అని నిట్టూరుస్తుంటారు. అలాంటిది స్వీడన్‌కి చెందిన ఓ దర్శకుడు మాత్రం 720గంటల నిడివితో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. అయితే ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దర్శకుడి చేయని ఈ సాహసం చేయడం వెనుక ఓ కారణం ఉంది.

స్వీడన్‌కు చెందిన అండర్స్‌ వేబర్గ్‌ అనే దర్శకుడు 2020 నాటికి రిటైరవ్వాలని రెండు దశాబ్దాల క్రితమే నిర్ణయించుకున్నాడు. సాదాసీదాగా రిటైరేతే ఏముంటుందిలే అని భావించిన వేబర్గ్‌.. తన చివరి చిత్రంతో చరిత్ర సృష్టించాలని భావించాడు. అంతేకాకుండా ఆ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలని అనుకున్నాడు. అందుకే ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక నిడివితో ఓ సినిమా తీయాలని నిశ్చయించుకున్నాడు. ఈ చిత్రం నిడివి 720 గంటలు ఉండేలా ప్లాన్‌ చేసుకున్నాడు. 720 గంటలు అంటే ఈ సినిమాని ఏకధాటిగా చూసినా 30రోజుల సమయం పడుతుందన్నమాట.అనుకున్నట్టుగానే తన చివరి చిత్రానికి కార్యరూపం మొదలుపెట్టాడు. ఆ సినిమాకి ‘యాంబియన్స్‌’ అనే టైటిల్‌ కూడా ఖరారు చేశాడు. ఏదేమైనా 2020 డిసెంబర్‌ 31న ఈ సినిమా విడుదల చేస్తామని వేబర్గ్‌ ప్రకటించాడు.

ఈ సినిమా కోసం వంద మందికిపైగా నటులను ఎంపిక చేశాడట. అంతేకాకుండా 720 గంటల ఈ సినిమాలో ఇప్పటికే 400 గంటలకు అవసరమైన సన్నివేశాలను చిత్రీకరించాడట. అయితే సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు వారానికి 7-8 గంటలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కానీ భారీ నిడివి గల చిత్రం కావడంతో చిత్రీకరణ కంటే పోస్ట్‌ ప్రొడక్షన్‌కే ఎక్కువ సమయం తీసుకుంటుందని.. అందుకే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా ముందుగానే ప్రారంభించామన్నారు. అయితే ఇంత నిడివి ఉండటంతో సన్నివేశాలు చూస్తున్నపుడు అవి మనకు జ్ఞాపకాలుగా గుర్తుండిపోయేందుకు సినిమాటోగ్రఫీ మీద ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నట్లు చెబుతున్నాడు. ఈ సినిమా కచ్చితంగా ఓ మాస్టర్‌ పీస్‌గా నిలిచిపోతుందని అభిప్రాయపడుతున్నాడు వేబర్గ్‌.

అంతేకాదు ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇప్పటికే ‘యాంబియన్స్‌’ చిత్రానికి సంబంధించిన రెండు ట్రైలర్లను విడుదల చేశాడు. 7 నిమిషాల నిడివితో 2014లో ఈ సినిమా తొలి ట్రైలర్‌ని విడుదల చేశారు. 2016లో 7 గంటల నిడివితో రెండో ట్రైలర్‌ని విడుదల చేశారు. అంతేకాదు 72గంటల నిడివితో మరో ట్రైలర్‌ని విడుదల చేయాలని వేబర్గ్‌ భావిస్తున్నాడట. ఈ ట్రైలర్‌ని వచ్చే ఏడాదికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.