తాప్సీకి రెండో లక్కీ ఛాన్స్

0టాలీవుడ్ లో హీరోయిన్ గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసే పనిలో బిజీగా ఉంది నార్త్ బ్యూటీ తాప్సీ పన్ను. టాలీవుడ్ లో వచ్చినంతగా వరస ఆఫర్లు రాకపోయినా వస్తున్న ఒకటి రెండు ఆఫర్లు పేరు తెస్తున్నవే అవడంతో తాప్సీ బాలీవుడ్ లో హ్యాపీగానే ఉంది. ఇంతకుముందు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి పింక్ సినిమాలో నటించింది. తాజాగా ఆయనతో కలిసి రెండోసారి నటించే అవకాశం రావడంతో తాప్సీ ఉప్పొంగిపోతోంది.

స్పానిష్ మూవీ ‘ద ఇన్విజిబుల్ ఘోస్ట్’ అఫీషీయిల్ రీమేక్ లో తాప్సీ – అమితాబ్ కలిసి నటించనున్నారు. సుజయ్ ఘోష్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ‘‘జీవితంలో ఒక్కసారైనా అమితాబ్ తో కలిసి నటించాలని అనుకుంటారు. నేనూ అలా అనుకున్న దాన్ని. ఆ లక్కీ ఛాన్స్ నాకు పింక్ సినిమాతో వచ్చింది. ఇప్పుడు రెండేళ్లలోనే ఇంకోసారి లక్కీ ఛాన్స్ వచ్చిందంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. అమితాబ్ తో నాది హిట్ పెయిర్ అన్న మాట చాలా ఎక్సయిటింగ్ గా ఉంది’’ అంటూ తాప్సీ తన ఆనందాన్ని పంచుకుంటోంది.

ఇంతవరకు సినిమాలే చేసిన తాప్సీ కెరీర్ లో తొలిసారి నీతిశాస్త్ర అనే షార్ట్ ఫిలిం చేసింది. ఈ షార్ట్ ఫిలిం డైరెక్టర్ కపిల్ వర్మ మంచి ఫ్రెండ్ కావడం.. దానికి తోడు కాన్సెప్ట్ బాగా నచ్చడం వల్లనే ఇందులో నటించానని చెబుతోంది. తాను నటించిన మూవీ లేదా షార్ట్ ఫిలిం ఎన్ని లక్షల మంది.. కోట్ల మంది చూశారన్న లెక్కలేవీ పట్టించుకోనని.. తన మనసుకు నచ్చిందే చేస్తానని అంటోందీ పింక్ బ్యూటీ.