ఆ వివాదంతో ఇండస్ట్రీని చులకన చేశారు!

0`మా`లో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారిన సంగతి తెలిసిందే. `మా` నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల నిధులు దుర్వినియోగమయ్యాయంటూ వచ్చిన ఆరోపణలు టాలీవుడ్ లో పెను దుమారం రేపాయి. నిధులు దుర్వినియోగం చేసినట్టు నిరూపిస్తే – తన ఆస్తి మొత్తాన్నీ ఇండస్ట్రీకి రాసిచ్చేస్తానని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా సవాల్ విసిరారు. అయితే నిధులు దుర్వినియోగం అయినట్లు అనుమానాలున్నాయని దానిపై ఓ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని `మా` కార్యదర్శి – సీనియర్ నటుడు నరేశ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం మీడియాలో హైలైట్ అయింది. దీంంతో తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తన యూట్యూబ్ చానెల్ ‘నా ఆలోచన’ లో తమ్మారెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ వివాదం చూస్తుంటే తనకు కోపం…నవ్వు వస్తున్నాయని తమ్మారెడ్డి అన్నారు. నరేశ్ – శివాజీ రాజాలిద్దరూ మంచివారని – చిన్నప్పటి నుంచి తనకు తెలుసని…వారిద్దరికీ స్వార్థపరులు కారని అన్నారు. వారిద్దరూ ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్లని….అటువంటి వారు ఈరోజున రోడ్డున పడటం బాధగా – కోపంగా ఉందని అన్నారు. `మా` సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఫండ్ రైజింగ్ చేద్దామనుకున్నారని – ఆ ఫంక్షన్ కు ఓ కంపెనీ వారు కోటి రూపాయలు ఇచ్చారని అన్నారు. ఆ ఫంక్షన్ అయిపోయిందని – ఇచ్చిన కోటి రూపాయల కంటే ఎక్కువ వస్తుందా? మిగులుతుందా? అన్నది సంతకాలు పెట్టకముందు ఆలోచించుకుని ఉండాల్సిందని అన్నారు.

అంతేగానీ ఇపుడు ఇద్దరూ ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం వల్ల ఉపయోగం లేదని….వారిని చూసి నవ్వాలో – ఏడ్వాలో – కొట్టాలో – కోప్పడాలో – తిట్టాలో అర్థంకాని పరిస్థితి అని అన్నారు. వారిద్దరూ రోడ్డున పడడం వల్ల తమలాగా ఖాళీగా ఉన్న వాళ్లకో – టీవీలలో మాట్లాడే వారికో అవకాశమివ్వడం తప్ప ఉపయోగం లేదని అన్నారు. ఈ తరహా సమస్యలన్నింటినీ పరిష్కరించుకునేందుకు సినిమా ఇండస్ట్రీలో ఓ కమిటీ వేసుకున్నామని అక్కడ చర్చించి ఉంటే వివాదం పరిష్కారం అయి ఉండేదని అన్నారు. లేని ఇష్యూని లేవనెత్తి….ప్రజలలోకి వెళ్లి ఇండస్ట్రీని చులకనచేయడం….బాధపడాల్సిన విషయమన్నారు. వారిద్దరూ వచ్చి కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని శివాజీరాజా – నరేష్ లకు తమ్మారెడ్డి సలహానిచ్చారు.