క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి అనంత్‌కుమార్

0Anantkumar-Hegdeన్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే ఇవాళ లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు. రాజ్యాంగాన్ని సవరిస్తామని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇదే అంశంపై బుధవారం పార్లమెంట్‌లో ఉభయసభలు దద్దరిల్లాయి. అయితే ఆ వివాదానికి కేంద్ర మంత్రి తెరదించారు. సభలో క్షమాపణలు చెప్పిన ఆయన తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ను, అంబేద్కర్‌ను తాను మనస్పూర్తిగా గౌరవిస్తానని, రాజ్యాంగామే తనకు అత్యున్నతమని, అందులో ఎటువంటి ప్రశ్నే లేదని, ఈ దేశ పౌరుడిగా తాను రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించలేరన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను ఎప్పుడూ అలా మాట్లాడలేదని, కానీ తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే, వాళ్లకు క్షమాపణలు చెబుతున్నట్లు కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. ఇవాళ లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ మనం కొన్ని సార్లు నిజం మాట్లాడామని భావిస్తుంటాం, కానీ దాని వల్ల కొందరు ఇబ్బందిపడుతుంటారని, మీరేదైనా తప్పు మాట్లాడితే, క్షమాపణలు చెప్పాలంటూ ఆమె కేంద్ర మంత్రిని కోరారు. రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలిగిస్తామని ఇటీవల కర్నాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హెగ్డే చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టించిన విషయం తెలిసిందే.