విన్నర్ ఐటెం సాంగ్ పై సుమ స్పందన

0Anchor-Sumaసాయిధరం తేజ్ మూవీ విన్నర్ లో సుమ పాట పాడిన సంగతి తెలిసిందే. సూయా సూయా అనసూయా అంటూ సాగే పాటను.. యాంకర్ సుమతో పాడించాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. ఇప్పటికే ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హాట్ యాంకర్ అనసూయ ఐటెంగాళ్ గా డ్యాన్సులు వేసిన పాటను.. మరో యాంకర్ సుమ పాడడం.. అసలు సిసలైన ప్రత్యేకత. ఆ పాట పాడాల్సిన సందర్భం గురించి చెప్పింది సుమ.

పాట పాడిన అనుభవం గురించి చెబుతూ.. ‘తమన్ కు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో.. ఎలా వచ్చిందో.. మొత్తానికి నన్ను సింగర్ ను చేయాలని ఆలోచన ఆయనకు రావడం ఏంటో.. ఫైనల్ గా నేను పాట పాడేయడం ఏంటో.. అది జనాలు వినేయడం.. బాగుంది.. చాలా బాగుంది.. 2017 ఇలా ఉంటుందని నేను అసలు ఊహించలేదు’ అంటూ నవ్వేసిన సుమ.. ‘తమన్ గారు కాల్ చేసి నన్ను ఇలా అడిగినపుడు ప్రాంక్ కాల్ చేశారని అనుకున్నారు. నాకు తెలుసు తమన్ గారూ.. మీరు ఏదో షో నుంచి కాల్ చేస్తున్నారు. ఉంటానండీ అని చెబితే.. లేదు లేదు నిజంగా పాడాలి అన్నారు తమన్. ఆ చెప్పిన నెల రోజుల తర్వాత చెన్నై వచ్చి పాట పాడాలని పిలుపు వచ్చింది. అప్పటికి కూడా నాకు నమ్మకం లేదు’ అని చెప్పింది సుమ.

‘సినిమా ఏంటంటే విన్నర్ అని చెప్పారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇదీ లిరిక్ అంటూ వాట్సాప్ లో చూపించారు. ఈ పాటా అనుకుని పాడేశాను. అంతా చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది’ అని చెప్పిన సుమ.. అనసూయ ఈ పాటలో నటించడంపై కూడా స్పందించింది. ‘నేను డ్యాన్స్ చేస్తే బాగోదు కదా అందుకే అనసూయతో వేయించారు’ అంటూ పంచ్ వేసిన సుమ.. ‘అనసూయ ఎప్పుడూ నా ఫేవరేట్. తనను తాను మెయింటెయిన్ చేస్తున్న విధానం నిజంగా గ్రేట్. ఇద్దరు యాంకర్లు ఒక పాటలో భాగం కావడం ఆనందం కలిగించింది’ అంటూ ‘ఈ క్రెడిట్ నాకు అనసూయకే దక్కుతుంది.. యా’ అంటూ తన ఆనందాన్ని చేష్టల్లోనే చూపించింది సుమ.