ట్రైలర్ టాక్: బ్లైండ్ థ్రిల్లర్ భలే ఉందే

0బాలీవుడ్లో ‘బద్లాపూర్’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు శ్రీరామ్ రాఘవన్. మూడేళ్ల కిందట విడుదలైన ఆ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ చిత్రంలో అడుగడుగునా శ్రీరామ్ దర్శకత్వ ప్రతిభను చూడొచ్చు. దీని కంటే ముందు ‘జానీ గద్దర్’ సైతం శ్రీరామ్ టాలెంట్ ఏంటో చూపించింది. ‘బద్లాపూర్’తో చాలా మంచి పేరు సంపాదించిన శ్రీరామ్.. తన తర్వాతి సినిమాపై నెలకొన్న అంచనాల్ని అందుకోవడం కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. అతను బాగా టైం తీసుకుని చేసిన కొత్త సినిమా ‘అందాదున్’ ట్రైలర్ తాజాగా లాంచ్ అయింది. ఇది చూస్తే శ్రీరామ్ అంత టైం తీసుకోవడంలో తప్పేమీ లేదనిపిస్తుంది. ఇది ఒక బ్లైండ్ థ్రిల్లర్ కావడం విశేషం. బ్లైండ్ థ్రిల్లర్ జానరేంటి అంటారా..? ఇందులో హీరో అంధుడు. ఈ చిత్రం ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగుతుంది.

‘విక్కీ డోనర్’తో తన టాలెంట్ ఏంటో చూపించిన ఆయుష్మాన్ ఖురానా ‘అందాదున్’లో హీరోగా నటించాడు. పుట్టుకతోనే అంధుడైనప్పటికీ.. మిగతా జ్ఞానేంద్రియాల సహకారంతో రోజువారీ కార్యక్రమాల్ని చాలా ఈజీగా నడిపించేస్తుంటాడు హీరో. అతనో పియానో ప్లేయర్. హీరోకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక మిడిలేజ్డ్ లేడీ పరిచయంతో హీరో జీవితం కల్లోలం మొదలవులవుతుంది. ఒక హత్యకు అతను సాక్షిగా మారతాడు. ఆ హత్య చేసిందెవరు.. పోలీసు విచారణలో హీరో ఏం చెప్పాడు.. కథ ముందుకు సాగే కొద్దీ హీరోలోని కొత్త కోణాలు ఎలా బయటపడ్డాయి అన్నది మిగతా కథ. మర్డర్ మిస్టరీలు చాలానే చూశాం కానీ.. ఇందులో హీరో అంధుడు కావడమే ప్రత్యేకత. హీరో పాత్ర అలా ఉన్నా వినోదానికి మాత్రం ఢోకా లేకుండా చూసుకున్నట్లున్నారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగిపోయేలా ఉంది. శ్రీరామ్ తన గత సినిమాకు పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని నడిపించినట్లున్నాడు. ట్రైలర్ భలేగా కట్ చేసి తన ముద్రను చూపించాడు శ్రీరామ్. అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో రాధికా ఆప్టే.. టబు కీలక పాత్రలు పోషించారు.