గర్భిణిని 5 కి.మీ మోసుకెళ్లిన జవాన్లు

0అది ఛత్తీస్‌గఢ్‌లోని హదేలీ గ్రామం. ఆ ప్రాంతంలో అసలే గతుకుల రోడ్లు.. ఆపై జడివాన కురవడంతో వాహన రాకపోకలు కొనసాగని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో సాహ్‌దాయి (30) అనే ఓ మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యే సూచనలు కనిపించాయి. ఆమె అంబులెన్సుకు ఫోన్‌ చేయగా గతుకుల రోడ్లపై ఆ వాహనం హదేలీకి రాలేకపోయింది. దీంతో తమ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) దళాల కార్యనిర్వాహక ప్రాంతం‌ (సీవోబీ) వద్దకు వెళ్లి ఆమె తన బాధను చెప్పుకుంది. వెంటనే ఆ జవాన్లు ఓ గర్భిణికి ఎలాగైనా సాయం చేయాలని భావించి, ఓ స్ట్రెచర్‌పై ఆమెను పడుకోబెట్టి ఐదు కిలోమీటర్లు మోసుకెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం సరిగ్గా ఉండడంతో అంబులెన్స్‌ అక్కడకు వచ్చింది. అందులో ఆమెను మర్దాపాల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఆ ప్రాంతంలో తాము చేపడుతోన్న ‘నక్సల్స్‌ నిరోధక’ ప్రాజెక్టులో భాగంగా గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు తాము ఆరోగ్య సంరక్షణ గురించి కూడా చెబుతున్నామని, ఆ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులో లేదని ఐటీబీపీ 41వ బెటాలియన్‌ కమాండర్‌ సురీందర్‌ ఖత్రి మీడియాకు చెప్పారు. ఆ మహిళకు జవాన్లు సాయం చేస్తుండగా తీసిన వీడియోను ఐటీబీపీ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐటీబీపీ పోస్ట్‌ కమాండర్‌ లక్ష్మికాని బృందం చేసిన ఈ పని పట్ల సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే దేశంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పించాలని ఈ వీడియో చూసిన వారు కామెంట్లు చేస్తున్నారు.