ఈసారి మిస్ ఇండియాగా తమిళ అందం!

0మరో అందాల పోటీ ముగిసింది. ప్రతి ఏటా నిర్వహించే మిస్ ఇండియా 2018 విజేత పేరు మంగళవారం అర్థరాత్రి తర్వాత ప్రకటించారు. ముంబయిలో జరిగిన ఎఫ్ బీబీ కలర్స్ మిస్ ఇండియా 2018 కార్యక్రమంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్.. ఫెమినా మిస్ ఇండియా కొత్త పేరును ప్రకటించారు.

మొత్తం 29 మంది ఫైనలిస్టుల మధ్య జరిగిన పోటీలో మిగిలిన వారిని వెనక్కి నెట్టి.. తమిళందానికి మిస్ ఇండియా టైటిల్ దక్కింది. తాజా విజేతగా తమిళనాడుకు చెందిన అనుకృతివాస్ గా నిలిచారు. ఈ పోటీలో హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి ఫస్ట్ రన్నరప్ గా నిలిస్తే.. రెండో రన్నరప్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రేయ నిలిచారు.

మొత్తానికి తమిళందం.. తెలుగందం మిస్ ఇండియా వేదిక మీద మెరిసిపోయాయి. ఇక.. తాజా మిస్ ఇండియా 2018 విషయానికి వస్తే.. సింగిల్ మదర్ ఛైల్డ్ గా అనుకృతి ప్రస్తుతం బీఏ ఫ్రెంచ్ చేస్తోంది. 19 ఏళ్ల ఈ ముద్దుగుమ్మకు వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువట.

అంతేకాదు.. రానున్న రోజుల్లో ఫ్రెంచ్ ట్రాన్స్ లేటర్ గా మంచి పేరు తెచ్చుకోవాలన్నది కోరికట. మరి.. అలాంటి వేళ.. గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చిన అనుకృతి తన తల్లి కలల్ని నెరవేర్చటం కోసమే తాను అందాల పోటీలో పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు.