లక్కీ హీరోయిన్ గా మారిన అనుపమ!

0Anupama-Parameswaran-turns-luckyపర భాషా హీరోయిన్లు తెలుగు పరిశ్రమలోకి రావడం, రాణించడం తరచూ జరిగేదే. వాళ్ళు అలా రాణించడానికి కనీసం నాలుగైదు సినిమాల సమయమైనా పడుతుంది. కానీ ఈ మధ్యే తెలుగులోకి అడుగుపెట్టిన మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు మాత్రం టాప్ రేంజుకు వెళ్ళడానికి పెద్దగా సమయం పట్టేలా కనబడటం లేదు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వెళుతున్నాయి.

ఆమె మొదట త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘అ.. ఆ’ భారీ విజయం సాధించి హీరో నితిన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అలాగే ఆమె రెండవ సినిమా ‘ప్రేమమ్’ కూడా మంచి హిట్ గా నిలిచి వరుస పరాజయాల్లో ఉన్న నాగ చైతన్యకు కెరీర్లో మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది. ఇక ఆమె తాజాగా నటించిన మూడవ చిత్రం ‘శతమానంభవతి’ కూడా విపరీతమైన సంక్రాంతి పోటీలో విడుదలై హీరో శర్వానంద్, దర్శక నిర్మాతలు ఆశించిన స్థాయి కంటే పెద్ద విజయాన్ని సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. ఇలా మూడు సినిమాలు భారీ విజయాలుగా నిలవడంతో అనుపమ స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. టాప్ దర్శకులు, హీరోలు ఆమెను కూడా ఒక చాయిస్ గా చూస్తున్నారు. ప్రస్తుతం ఆమె త్వరలో మొదలుకానున్న రామ్ చరణ్ – సుకుమార్ ల చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసింది.