స్వీటీ రిటైర్ మెంట్ నిజమా?

0

స్వీటీ అలియాస్ అనుష్క శెట్టి దశాబ్ధం పైగానే టాలీవుడ్ ని ఏలిన సంగతి తెలిసిందే. నాగార్జున `సూపర్` సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క సౌత్లో అగ్ర కథానాయికగా పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఇటీవలే బాహుబలి సిరీస్ లో దేవసేనగా నటించి మైమరిపించింది. అరుంధతి – భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ ఒక రేంజు ఉందని నిరూపించింది. అయితే అంత స్టార్ డమ్ ఉండీ అనుష్క ఇటీవల వేరొక కొత్త ప్రాజెక్టుకు సంతకం చేయకపోవడంతో అందరిలో ఒకటే సందేహాలు. అసలు స్వీటీకి ఏమైంది? ఎందుకని నటించడం లేదు? అంటూ అభిమానుల్లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది.

అయితే అందుకు ఓ కారణం ఉంది. అదే పెళ్లి ఘడియ. అనుష్క వయసు 36. అందువల్ల ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేయాలని చూస్తున్నారని ఇటీవల ప్రచారమైంది. స్వీటీ ఆ మాటల్ని ఖండించకపోవడంతో రకరకాల సందేహాలు కలిగాయి. ప్రభాస్ తో ఎఫైర్ – పెళ్లి అంటూ సాగించిన ప్రచారాన్ని మాత్రం తిరస్కరించింది. ఇకపోతే .. స్వీటీ ఇంకా వేరొక కొత్త సినిమాకి సంతకం చేయకపోవడానికి కారణమేంటి? అంటే తన పర్సనాలిటీ యువహీరోలకు సూట్ కావడం లేదన్న వాదనా వినిపిస్తోంది. కాజల్ – శ్రీయ – నయన్ లాంటి సీనియర్ నాయికలు యువహీరోలకు సూటవుతున్నా అనుష్క మాత్రం సూట్ కావడం లేదని అందుకే తనకు అవకాశాలు రావడం లేదని మరో కొత్త ప్రచారం ఊపందుకుంది.

అయితే వీటిలో ఏది నిజం.. ఏది అబద్ధం అన్నది చెప్పలేం. అనుష్క ఆర్.మాధవన్ సరసన ఓ చిత్రంలో నటించనుందని `నా నువ్వే` నిర్మాతలతో వేరొక చిత్రం చేస్తోందని ఇదివరకూ ప్రచారమైనా వాటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అలాగే ప్రభాస్ – జిల్ రాధాకృష్ణ ప్రాజెక్టు ప్రారంభమైనా ఈ చిత్రంలో స్వీటీ నటిస్తోంది అన్న మాట కూడా వినిపించలేదు. చివరికి తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ప్రాజెక్లుకు స్వీటీ ఇదివరకూ కమిటైంది. కానీ ఆ సినిమాకి సంబంధించిన వివరాలు రాలేదు. దీంతో అసలు అనుష్కకు ఏమైంది? అంటూ అభిమానులు ఒకటే కంగారు పడుతున్నారు. మరి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానంతో స్వీటీ ముందుకొస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer