అనుష్క పెళ్లిపై రూమర్లు.. లీకుల వీరుడు ఎవరో తెలుసా!

0anushka-marriage-rumorsఅరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో విశేష ప్రేక్షకాదరణను కూడగట్టుకొన్న అందాల నటి అనుష్క పెళ్లిపై ఇటీవల కాలంలో జోరుగా రూమర్లు అందుకొన్నాయి. హీరో ప్రభాస్‌తో అఫైర్ నడుస్తున్నదని, వారిద్దరూ పెళ్లి చేసుకొంటున్నారని రూమర్లు షికారు చేస్తున్నాయి. ఇవే కాకుండా ఆర్య, రానా‌తో అఫైర్ ఉందంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి రూమర్లను ప్రచారం చేస్తున్న ఇంటిదొంగను పట్టుకొని అతడిని విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తున్నది.

అనుష్క అఫైర్, పెళ్లి రూమర్లను ప్రచారం చేస్తున్నది ఎవరో కాదు.. ఆమె దగ్గర పనిచేసే అసిస్టెంట్‌ అని తేలింది. దాంతో వెంటనే అసిస్టెంట్‌ను తొలగించినట్టు తెలుస్తున్నది. ఇటీవల అనుష్క తన సహాయకులను తొలగిస్తున్నదని, పెళ్లి కారణంగా సిబ్బందిని తగ్గించుకొంటున్నదని వార్తలు వచ్చాయి. అయితే సిబ్బందిని తీసి వేయడం వెనుక అసలు కారణం ఇదని ఫిలింనగర్‌లో వార్త చక్కర్లు కొడుతున్నది.

ఇదిలా ఉండగా, మదర్స్ డే పురస్కరించుకొని అనుష్క తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నది. ఒంటి నిండా నగలతో యువరాణిలా కనిపిస్తే బాగుంటుందని మా అమ్మ ప్రఫుల్లశెట్టి కోరిక. కానీ నాకు భారీగా నగలు పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు. అయితే రుద్రమదేవి, బాహుబలి చిత్రాల కారణంగా భారీగా నగలు ధరించాల్సి వచ్చింది. దాంతో అమ్మ కోరిక తీరింది. పట్టు వస్త్రాలు, నగలతో సెట్స్‌లో ఉన్న నన్ను చూసి మురిసిపోయేది. ఆ సినిమాలను మా అమ్మ ఎన్నిసార్లు చూసిందో చెప్పలేను అని అనుష్క వెల్లడించింది.

బాహుబలి2తో జాతీయస్థాయిని ఆకర్షించిన అనుష్క ప్రస్తుతం భాగమతి చిత్రంలో నటిస్తున్నది. ఆ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి పిల్లా జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఇక బాహుబలి2 తర్వాత బాలీవుడ్‌లో భారీగా ఆఫర్లు కూడా వస్తున్నట్టు తెలుస్తున్నది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో అనుష్క నటిస్తున్నదనే వార్త పలు జాతీయ వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తున్నది. అయితే బాలీవుడ్ చిత్రాలను ఇంకా అంగీకరించలేదని, చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.