ప్రశాంతగా కొనసాగుతున్న ఏపీ బంద్…

0ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఈరోజు ప్రత్యేక హోదా సాధన సమితి ఏపీ బంద్ కు పిలుపును ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ ప్రశాంతగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ను ప్రభుత్వం ఏర్పటు చేసింది. ఈ బంద్ కు జనసేన, వైకాపా, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నారు.

బంద్ సందర్బంగా వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. బంద్‌ కారణంగా ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. అన్ని డిపోల బస్సులు రోడ్డెక్కలేదు. మరోపక్క సినిమా థియేటర్ల యాజమాన్యం సైతం బంద్ కు మద్దతు ప్రకటించారు. ఈరోజు ఉదయం ఆటను రద్దు చేసారు. అలాగే ఈరోజు జరగాల్సిన పాలిటెక్నిక్‌ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం జరిగే పరీక్షలను వాయిదా వేశారు. చాలాచోట్ల వ్యాపారస్తులు స్వచ్ఛందంగానే తమ దుకాణాలను మూసివేశారు. మొత్తానికి అన్ని జిలాల్లో బంద్ ప్రశాంతగా జరుగుతుంది.