ఏపీ కొత్త మంత్రులు వీరే..

0chandrababu-reshuffles-ap-cabinetఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి వర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. ప్రస్తుత మంత్రుల్లో ఐదుగురిని తొలగించి.. కేబినెట్‌లోకి కొత్తగా 11 మందిని తీసుకున్నారు. ఆదివారం ఉదయం వెలగపూడి సచివాలయం వద్ద గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంతో సహా మంత్రుల సంఖ్య 26కు చేరింది.

ఊహించినట్టుగానే చంద్రబాబు కొడుకు నారా లోకేశ్‌కు మంత్రి పదవి దక్కింది. ఆయన ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులుకు చంద్రబాబు కేబినెట్‌లో బెర్తులు దక్కాయి. వీరితో పాటు నక్కా ఆనంద్‌బాబు, పితాని సత్యనారాయణ, కొత్తపల్లి జవహర్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణలో ఫిరాయింపుదారులకు పెద్దపీట వేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు మంత్రి పదవి ఇస్తారని ముందు నుంచి వార్తలు రాగా.. ఆమెతో పాటు అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయకృష్ణ రంగారావులకు మంత్రి పదవులు దక్కాయి. తొలుత కళా వెంకట్రావు, ఆ తర్వాత నారా లోకేశ్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత లోకేశ్.. చంద్రబాబుకు, గవర్నర్ నరసింహన్‌కు పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయి.

మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు అగ్రవర్ణాలకు పెద్దపీట వేశారు. కేబినెట్‌ నుంచి ఇద్దరు మహిళలను తొలగించి విస్తరణలో ఒక్కరికే అవకాశం ఇచ్చారు. గిరిజనులకు, మైనార్టీలకు చోటు దక్కలేదు. మంత్రి వర్గ విస్తరణపై టీడీపీలో అసంతృప్తి రాజుకుంది. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడంపై టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక కేబినెట్‌ నుంచి ఉద్వాసనకు గురైనవారు, మంత్రి పదవులు ఆశించి అవకాశంరాని సీనియర్లు రగిలిపోతున్నారు. టీడీపీ నేతలు వీరిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొత్త మంత్రులు వీళ్లే..

1. నారా లోకేశ్‌ (ఎమ్మెల్సీ)
2. కిమిడి కళావెంకట్రావు (ఎమ్మెల్సీ)
3. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (ఎమ్మెల్సీ)
4. నక్కా ఆనంద్‌బాబు (ఎమ్మెల్యే)
5. పితాని సత్యనారాయణ (ఎమ్మెల్యే)
6. కొత్తపల్లి జవహర్‌ (ఎమ్మెల్యే)
7. కాల్వ శ్రీనివాసులు (ఎమ్మెల్యే)
8. భూమా అఖిలప్రియ (ఎమ్మెల్యే) 9. అమర్‌నాథ్‌రెడ్డి (ఎమ్మెల్యే)
10 ఆదినారాయణరెడ్డి (ఎమ్మెల్యే)
11. సుజయకృష్ణ రంగారావు (ఎమ్మెల్యే)

ఉద్వాసనకు గురైనవారు..

కిమిడి మృణాళిని
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
పీతల సుజాత
రావెల కిషోర్‌బాబు
పల్లె రఘునాథ్‌రెడ్డి

కొత్త మంత్రులతో కలిపి జిల్లాల వారీగా మంత్రుల జాబితా ఇదే..

శ్రీకాకుళం: అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు
విజయనగరం: సంజయ్‌ కృష్ణ రంగారావు
విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు
తూర్పుగోదావరి: యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప
పశ్చిమగోదావరి: కేఎస్‌. జవహర్‌, పితాని సత్యనారాయణ, మాణిక్యాలరావు
కృష్ణా: కామినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర
గుంటూరు: ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు
ప్రకాశం: సిద్ధా రాఘవరావు
నెల్లూరు: నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
కడప: ఆదినారాయణరెడ్డి
కర్నూలు: కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ
అనంతపురం: పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు
చిత్తూరు: నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, అమర్‌నాథ్‌ రెడ్డి