ఆక్వామ్యాన్ ట్రైలర్ అదిరిందిగా..

0మనుషుల ఫాంటసీలకు వెండితెరపై అద్భుతమైన రూపం ఇవ్వడంలో హాలీవుడ్ ఫిలిం మేకర్లకు మించిన వాళ్లుండరు. సూపర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్.. బ్యాట్ మ్యాన్.. ఇలా ఎన్నో విచిత్రమైన పాత్రలతో సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించారు హాలీవుడ్ ఫిలిం మేకర్స్. ఈ కోవలోనే తాజాగా ‘ఆక్వామ్యాన్’ తెరపైకి వస్తున్నాడు. సగం మనిషిగా.. సగం చేపగా ఉండే చిత్రమైన క్యారెక్టర్ ఇది. ఈ ఏడాది రాబోయే మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన ‘ఆక్వామ్యాన్’ ట్రైలర్ ఆదివారం లాంచ్ చేశారు. సూపర్ హీరో సినిమాల్ని అమితంగా ఇష్టపడే ప్రేక్షకుల్ని ఈ ట్రైలర్ కట్టి పడేస్తోంది.

ఇంతకుముందు ‘సూపర్ మ్యాన్ వెర్సస్ బ్యాట్ మ్యాన్’.. ‘డాన్ ఆఫ్ జస్టిస్’.. ‘జస్టిస్ లీగ్’ లాంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన జేసన్ మొమోవా ఇందులో ఆక్వామన్ పాత్రలో కనిపించాడు. అతను ఆ పాత్రకు భలేగా సెట్టయ్యాడు. సముద్ర గర్భంలోని జలాంతర్గామిలోకి ఆక్వామన్ గా అతను దూసుకెళ్లే ఇంట్రడక్షన్ షాట్ అదిరిపోయింది. యాంబర్డ్ హార్డ్ ఇందులో కథానాయికగా నటించింది. అతడి విన్యాసాలు ట్రైలర్లో బాగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ అంతా భారీతనం కట్టి పడేస్తోంది. గ్రాఫిక్స్.. విజువల్స్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే యాక్షన్ ప్రియులకు సినిమా కనువిందు చేసేలా ఉంది. జేమ్స్ వ్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వార్నర్ బ్రదర్స్.. శాండియాగో కామిక్ కాన్ సంస్థ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ఈ ఏడాది డిసెంబరు 21న ‘ఆక్వామన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.