అరవింద సమేత- వీరరాఘవ ట్రైలర్ రివ్యూ

0

తారక్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఆ అరుదైన ఉద్విగ్న క్షణం రానే వచ్చింది. `అరవింద సమేత- వీరరాఘవ` ట్రైలర్ యూట్యూబ్ లోకి దూసుకొచ్చింది. మాటల మాయావి త్రివిక్రమ్ నుంచి వస్తున్న ఫ్యాక్షన్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇదని ముందే తెలుసు కాబట్టి అభిమానులు ఆ కోణంలోనే ఈ ట్రైలర్ ని వీక్షిస్తారనడంలో సందేహం లేదు. అందువల్ల అనవసర హైప్ అవసరం కూడా లేదు. అయితే ఈ ట్రైలర్ ఎలా ఉంది? ఫ్యాన్స్ ఆశించినంత క్యూరియాసిటీతో ఉందా? లేదా.. పరిశీలిస్తే…

మరోసారి తారక్ అభిమానులకు కావాల్సిన ట్రీట్ లభించిందనే చెప్పాలి. ఫ్యాన్స్ కు – అన్ని వర్గాల ప్రేక్షకులకు పెద్ద తెరపై అన్ లిమిటెడ్ ఎమోషనల్ యాక్షన్ ట్రీట్ ఖాయమని అర్థమైంది. వీరరాఘవ అన్న పేరుకు తగ్గట్టే తారక్ వీరత్వాన్ని 200 పర్సంట్ తెరపై ఆవిష్కరించారని ట్రైలర్ చెబుతోంది. ఈ సినిమాలో మరోసారి తారక్ లోని రోమియోని వీక్షించే వీలుంది. తారక్ – పూజా మధ్య లవ్ ట్రాక్ గమ్మత్తుగా ఆకట్టుకుంటోంది. ఉన్నట్టుండి ప్రేమా దోమా అంటూ తిరిగే కుర్రాడిలో ఫ్యాక్షన్ కోణాన్ని సడెన్ గా బయటకు తీయడంతో అసలైన ఎగ్జయిట్ మెంట్ ని పెంచగలిగారు. ఇక ఈ ట్రైలర్ లో త్రివిక్రమ్ మార్క్ డైలాగులకు కొదవేం లేదు. ఎమోషన్ ని పీక్స్ తీసుకెళ్లే సత్తా ఉన్న పంచ్లు అరవింద సమేతలో బలెడు ఉన్నాయి. అయితే అవన్నీ ఎంతో బ్యాలెన్స్డ్ గా ఎక్కడా అతి లేకుండా కుదిరాయి. “కదిరప్పా ఈడ మంది లేరా.. కత్తుల్లేవా?“ అంటూ తారక్ సింహాద్రిలా విరుచుకుపడే ఆ ఒక్క సీన్ తో అరవింద సమేత గ్రాఫ్ ఒక్కసారిగా స్కైని తాకింది. ఈ ఫ్యాక్షన్ – యాక్షన్ వల్ల రక్తపాతంతో తడిసిన సీమకు శాంతి కావాలి. అది తెచ్చే దమ్మున్న సాఫ్ట్ కుర్రాడిగానూ తారక్ లో యాంగిల్ కనబడుతోంది. ఒక మామూలు కుర్రాడు కత్తి పట్టాడంటే దాని వెనక అతి పెద్ద అగాధమే ఉందని ట్రైలర్ చెబుతోంది.

కరువుతో సీమ ప్రాంతం అల్లాడితే.. కాపాడేవాడొకడు కావాలి. “30 ఏళ్ల నాడు మీ తాత కత్తి పట్టాడంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతందా? వాడిని ఎదిరించిన ఎవడినైనా కొట్టగలడు“ అంటూ తారక్ తల్లి చేత ఎమోషనల్ డైలాగ్ ని చెప్పించడం ద్వారా సీమలో రక్తపు మరకల్ని ఆవిష్కరించారు. “అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పవాడు.. వాడే గొప్ప! అంటూ తారక్ లోని క్రూరత్వాన్ని చల్లబర్చే పాత్రలో నీలాంబరి (పూజా) చెప్పిన డైలాగ్ థీమ్ ని ఎలివేట్ చేసింది. “సర్ వందడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకూ తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈ ఒక్క అడుగు వందడుగులతో సమానం సర్.. తవ్వి చూడండి.. “ అంటూ తారక్ ఆఫీసర్ ముందు చెప్పిన డైలాగ్ సీమ కథలో డెప్త్ ని చెబుతోంది. ఇకపోతే ఇందులో లోటుపాట్లు లేవా? అంటే .. మళ్లీ మరో రొటీన్ ఫ్యాక్షన్ సినిమా చూపిస్తున్నారా? ఇదివరకూ వచ్చిన `మిర్చి` సినిమాలోనూ ఫ్యాక్షన్ నుంచి శాంతి కావాలని కోరే హీరోయిజమే కదా? ఇప్పుడు మళ్లీ అదే చూపిస్తున్నారా? అన్న ఫీల్ ట్రైలర్ కలిగించింది. అయితే దానిని త్రివిక్రమ్ ఎంతవరకూ కప్పి పుచ్చుతాడు? ఇతర దర్శకులు చూపించేసిన ఫ్యాక్షన్ థీమ్ ని ఎంచుకున్నా.. పట్టు తప్పకుండా తనదైన పంథాలో చూపించడంలో ఎంతవరకూ సక్సెసవుతాడు? అన్నదే ఈ సినిమా జయాపజయానికి – రేంజుకు కారణం కాబోతోంది. అక్టోబర్ 11న పెద్ద తెరపై తారక్ ట్రీట్ షురూ అయ్యింది. ట్రైలర్ అంచనా పెంచింది. మరి సినిమాలో వ్యవహారం ఎంతో ఆడియెన్ ఆరోజే తేల్చాలి.

 
Please Read Disclaimer