మరో వివాదంలో చిక్కుకున్న అర్జున్ రెడ్డి

0Arjun-Reddy-Reviewఅర్జున్ రెడ్డి సినిమాను ఆది నుంచి వివాదాలు వెంటాడుతూనే వున్నాయి. టీజర్‌లో వున్న బూతు డైలాగ్స్ మొదలుకుని సినిమా రిలీజైన తర్వాత సినిమాలో ఎన్నో అభ్యంతరకరమైన దృశ్యాలు వున్నాయనే ఫిర్యాదు వరకు ప్రతీది ఈ సినిమాను వివాదాస్పదం చేశాయి. ‘ అర్జున్ రెడ్డి ‘లో వున్న కథాంశం, డైలాగ్స్ సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చేందుకు కారణమయ్యాయి. సినిమాలో పలు అభ్యంతరకరమైన సన్నివేశాలు వున్నాయని.. వెంటనే సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హన్మంత రావు నిరసన వ్యక్తంచేశారు. అయినా ఈ సినిమా కలెక్షన్స్ పెరిగాయే కానీ ఏ మాత్రం తగ్గలేదు.

ఇదిలావుంటే, ఈ సినిమా తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. తన అనుమతి లేకుండానే ఇక.. సే.. లవ్ అనే తన చిత్రాన్ని కాపీ కొట్టి ఈ అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారు అంటూ నాగరాజు అనే డైరెక్టర్ ఆరోపిస్తున్నారు. ‘ఇక.. సే.. లవ్’ అనే చిత్రంలోని కథనే కాపీ కొట్టి అర్జున్ రెడ్డి సినిమాను రూపొందించారు అని ఆరోపిస్తున్న డుంగ్రోత్ నాగరాజు.. వెంటనే అర్జున్ రెడ్డి సినిమాను నిలిపేసి తనకి రూ. 2కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని అర్జున్ రెడ్డి చిత్ర నిర్మాతలకి నోటీసులు జారీచేశారు.