ఆర్జే సంధ్య అనుమానాస్పద మృతి: భర్త విశాల్ అరెస్ట్

0Radio-jockey-sandhya-singhరేడియో జాకీ సంధ్యాసింగ్‌(28) అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త ఆర్మీ మేజర్‌ విశాల్‌ వైభవ్‌ను బొల్లారం పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సంధ్యాసింగ్‌ కొద్ది రోజుల క్రితం తన బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కాగా, సంధ్యాసింగ్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మేజర్‌ విశాల్‌ వైభవ్‌, అతడి తల్లిపై మృతురాలి సోదరి ఉమాసింగ్‌ బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక, సంధ్యా సింగ్‌ను ఆమె భర్త, అత్త తరచూ డబ్బులు కావాలని వేధించే వారని పేర్కొన్నారు.

కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకునేందుకు రక్షణశాఖ అధికారుల అనుమతి కోరారు. అంతలోనే విశాల్‌ వైభవ్‌ గుండెపోటు వచ్చిందంటూ రక్షణశాఖ ఆస్పత్రిలో చేరాడు.

కాగా, పోలీసులు రక్షణ శాఖాధికారులపై ఒత్తిడి పెంచడంతో మిలిటరీ అధికారులు నిందితుడిని బొల్లారం పోలీసులకు అప్పగించారు. దీంతో అడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు బొల్లారం పోలీసులు.

కాగా, ఘజియాబాద్‌కు చెందిన సంధ్యా సింగ్‌కు మేజర్ విశాల్‌కు 2015, సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. వివాహం సందర్భంగా భారీగానే కట్న కానుకలు అందించించినట్లు సంధ్యా సింగ్ సోదరి తెలిపింది. అయినా తమ సోదరిని విశాల్, అతని తల్లి వేధింపులకు గురిచేసేవారని వాపోయింది.

సంధ్యా సింగ్ ఆత్మహత్య చేసుకునే ముందు రోజు(గత సోమవారం) కార్యాలయానికి వచ్చిందని, అయితే తొందరగానే ఇంటికి వెళ్లిపోయిందని రేడియో చార్మినార్ సిబ్బంది తెలిపారు. గత మంగళవారం వారం నుంచి ఆమె ఆఫీసుకు రాలేదని, ఫోన్ చేసినా స్విఛాఫ్ వచ్చిందని చెప్పారు. అప్పుడప్పుడు ఆమె జీవితంపై విసుగుపుట్టినట్లు చెప్పేదని తెలిపారు.