అమ్మ మరణం..డ్రైవర్ సంచలన విషయాలు

0తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికీ అమ్మ మరణం విషయంలో ఎన్నో సందేహాలు ఉండగా…తాజాగా ఈ ఉత్కంఠ మరింత కొనసాగే పరిణామం చోటుచేసుకుంది. అసలు ఆమెను దవాఖానకు తరలించడానికి ముందు ఏం జరిగింది? పోయెస్ గార్డెన్ లో ఎవరెవరు ఉన్నారు? జయలలితను దవాఖానకు ఎవరు తీసుకెళ్లారు.. ఎలా తీసుకెళ్లారు? అన్న విషయాలపై ఇప్పటికే పలువురిలో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై జయలలిత డ్రైవర్ కీలక వివరాలను వెల్లడించారు. ఈ మేరకు జయలలిత మృతిపై దర్యాప్తు జరుపుతున్న జస్టిస్ అరుముగస్వామి కమిషన్కు కన్నన్ ఓ అఫిడవిట్ సమర్పించారు. అయితే గతంలో శశికళ డాక్టర్ శివకుమార్ సమర్పించిన అఫిడవిట్ లోని వివరాలు – కన్నన్ సమర్పించిన అఫిడవిట్ లోని వివరాలు పూర్తి విరుద్ధంగా ఉండటం కొత్త చర్చకు దారితీసింది.

డ్రైవర్ కన్నన్ సమర్పించిన అఫిడవిట్ లో ….‘22 సెప్టెంబర్ 2016న నేను అమ్మ (జయలలిత) గదిలోకి వెళ్లేసరికి ఆమె అచేతన స్థితిలో ఉన్నారు. పక్కనే కొన్ని ఫైళ్లు – మూత లేని పెన్ను ఉన్నాయి. తనను చూసిన శశికళ ఓ కుర్చీ తీసుకురావాలని – అమ్మను దవాఖానకు తీసుకెళ్దామని చెప్పారు. ఆ కాసేపటికే అమ్మ వ్యక్తిగత భద్రతా అధికారి వీర పెరుమాళ్ అక్కడికి వచ్చారు. దీంతో ఇద్దరం కలిసి ఆమెను మరో కుర్చీలోకి మార్చాం. కుర్చీలో జయలలితను కొద్ది దూరం తీసుకెళ్లేసరికి ఆమె కింద పడిపోతున్నట్లు కనిపించారు. దీంతో స్ట్రెచ్చర్ తీసుకురావాలని నిర్ణయించాం. రాత్రి 10 గంటల సమయంలో కారు తీసుకురావాలని పెరుమాళ్ నాకు సూచించారు. అయితే రాత్రి 8.30 గంటల సమయంలో జయలలిత వ్యక్తిగత వైద్య సలహాదారు – శశికళ బంధువు డాక్టర్ కేఎస్ శివకుమార్ పోయెస్ గార్డెన్ లోనే ఉన్నారు. తర్వాత గంట సేపు ఆయన కనిపించలేదు. నేను అమ్మ గదిలోకి వెళ్లినప్పుడు మాత్రం అక్కడే ఉన్నారు. ఆయన మళ్లీ పోయెస్ గార్డెన్ లోకి ఎప్పుడు వచ్చారో తెలియదు. శశికళ – పెరుమాళ్ మాత్రమే జయలలిత వెంట దవాఖానకు వెళ్లారు’ అని కన్నన్ పేర్కొన్నారు.