పారితోషికం రాలేదంటూ కోర్టుకెక్కిన నటుడు!

0సీన్ రివర్స్ అయ్యింది. సాధారణంగా ప్రముఖ నటుడు సినిమా చేసిన తర్వాత ఫలితం తేడా వస్తే.. తమను ఆదుకోవాలంటూ నిర్మాత నటుడ్ని ఆశ్రయించటం చూస్తుంటాం. ఇందుకు భిన్నంగా ప్రముఖ నటుడు అరవింద్ స్వామి ఒక నిర్మాతపై కోర్టును ఆశ్రయించారు.

తాను నటించిన చదురంగవేట్లై 2 చిత్రంలో తనకు ఇస్తానని చెప్పిన పారితోషికం ఇవ్వని తీరుపై చిత్ర నిర్మాతపై ఆయన ఫిర్యాదు చేశారు. తనకు బాకీగా ఉన్న పారితోషికాన్ని తిరిగి ఇప్పించేలా నిర్మాతకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తాజాగా వివరణ కోరుతూ నిర్మాతకు నోటీసులు పంపింది. అరవింద్ స్వామి.. త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన చదురంగవేట్టై2 చిత్రాన్ని దర్శకుడు మనోబాలా నిర్మించారు. ఈ చిత్రంలో భాగంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం పారితోషికంలో ఇంకా రూ.1.79కోట్లు బాకీ ఉందని.. ఈ మొత్తాన్ని ఏడాదికి 18 శాతం వడ్డీతో సహా చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.

ఈ ఉదంతంపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ నెల 20 లోపు నిర్మాత మనోబాల కోర్టుకు వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.