దత్ స్పీడ్ సిక్త్స్ గేర్ లో..

0పరిశ్రమలో అగ్రనిర్మాతగా అశ్వనిదత్ కి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. దశాబ్ధాల పాటు సినీనిర్మాణంలో ఆయన ఎంతో అనుభవం ఘడించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ కి నాలుగు దశాబ్ధాల చరిత్ర ఉంది. పరిశ్రమలో అందరు అగ్రకథానాయకులతో సినిమాలు తీశారాయన. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందించి మెగా నిర్మాతగా దత్ పాపులరయ్యారు. వైజయంతి బ్యానర్ మెగాబ్యానర్ గా పాపులరైంది. అయితే కాలక్రమంలో కొన్ని భారీ డిజాస్టర్స్ ఈ బ్యానర్ వ్యాల్యూను తగ్గించాయన్నది వాస్తవం. అదో రకం ఫేజ్. ఆ క్రమంలోనే దత్ వారసురాళ్లు ప్రియాంక దత్ – స్వప్నదత్ బరిలో దిగారు. త్రీ యాంజెల్స్ పేరుతో ఓ బ్యానర్ ని స్థాపించి అందులో మీడియం బడ్జెట్ సినిమాల్ని నిర్మించారు. అయితే వాటితో ఆ బ్యానర్‌కి యువనిర్మాతలకు పేరొచ్చింది కానీ డబ్బు రాలేదు. కమర్షియల్ గా ఆశించిన విజయాల్ని దక్కించుకోలేకపోయారు.

సరిగ్గా ఇలాంటి టైమ్ లోనే `ఎవడే సుబ్రమణ్యం` రూపంలో ఓ చక్కని విజయం అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ `మహానటి` లాంటి ఒక గొప్ప ప్రయత్నం. ఈ సినిమా కోసం అశ్వనిదత్ సహా అల్లుడు నాగ్ అశ్విన్ – స్వప్నదత్ – ప్రియాంక దత్ అందరూ ఎంతగానో శ్రమించారు. ఆ శ్రమకు తగ్గ ఫలితం అందుకున్నారు. మహానటి దత్ కాంపౌండ్ లో కొత్త గ్లో తెచ్చింది. అందుకే నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న దత్ లో ప్రత్యేకమైన గ్లో కనిపిస్తోందన్న మాటా వినిపిస్తోంది. సావిత్రి జీవితకథతో తెరకెక్కించిన మహానటి ఎవరూ ఊహించని రీతిలో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 80 కోట్లు పైగా వసూలు చేసి స్ఫూర్తివంతమైన విజయాన్ని అందించింది. అందుకే దత్‌కి ఈ బర్త్ డే చాలా స్పెషల్.

`జగదేకవీరుడు – అతిలోక సుందరి` తర్వాత మళ్లీ అంతటి ఆనందం ఇపుడే అనుభవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ ఉత్సాహంలోనే దత్ ఇండస్ట్రీ అగ్రహీరోలతో భారీ చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు నాగార్జున- నాని కాంబోతో `దేవదాస్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `రాజకుమారుడు` చిత్రంతో మహేష్‌ని పరిచయం చేసిన దత్ ఇప్పుడు మహేష్ ల్యాండ్ మార్క్ 25వ సినిమా `మహర్షి`ని నిర్మిస్తున్నారు. దిల్ రాజుతో కలిసి దత్ పెట్టుబడులు సమకూరుస్తున్నారు. తదుపరి చిరు- పవన్ తో సినిమా చేసే ఆలోచనలోనూ దత్ ఉన్నారు. ఇక విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోకి తొలినాళ్లలో `ఎవడే సుబ్రమణ్యం` లాంటి ఆఫర్ ఇచ్చింది దత్ కాంపౌండ్. కాబట్టి ఇకపై దేవరకొండతోనూ భారీ సినిమాలుంటాయనడంలో సందేహం లేదు. హ్యాపి బి-డే టు దత్ సాబ్! ఈ స్పీడ్ ఇలానే కొనసాగాలని ఆకాంక్షిస్తూ.. శుభాకాంక్షలు.