22అంతస్తులుగా ఎస్‌బీఐభవన నిర్మాణం

0



attractive-amrita-univarsitరాజధానిలో వివిధ విద్య, వైద్య సంస్థలు, బ్యాంకులు, సంస్థలు నిర్మించే భవనాలు, వాటి ప్రాంగణాలు చూడగానే ఆకట్టుకునేలా, నిరుపమానంగా (ఐకానిక్‌) ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో అమృత విశ్వవిద్యాపీఠం (అమృత యూనివర్సిటీ) నిర్మాణ పనులకు వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన చేయనున్నారు. బుధవారం సాయంత్రం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అమృత యూనివర్శిటీ ఆకృతుల్ని, మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించారు. ఈ యూనివర్సిటీలో 2018 ఆగస్టు రెండోవారం నుంచి తరగతులు మొదలవుతాయని అధికారులు తెలిపారు. అమృత విశ్వవిద్యాలయానికి నవులూరువద్ద ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కేటాయించింది. తొలి దశలో 150 ఎకరాల్లో నిర్మాణాలు చేపడతారు. తొలి దశలో భాగంగా ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటవుతాయి. అమృత క్యాంపస్‌ ఆకృతుల్ని ఆకట్టుకునేలా రూపొందించారు. క్యాంపస్‌ ప్రవేశ ద్వారం వద్ద ఎత్తైన గాలిగోపురాన్ని పోలిన ఆకృతి ఉంటుంది.

* రాజధానిలో ఇప్పటికే స్థలాలు పొందిన ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి, బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి, ఇండో యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌, బ్రహ్మకుమారీ విశ్వశాంతి కేంద్రం ప్రతినిధులు తాము అమరావతిలో నిర్మించే భవనాల ఆకృతుల్ని, ప్రణాళికల్ని, పనుల షెడ్యూళ్లను ముఖ్యమంత్రికి వివరించారు.

* నిర్దేశించిన గడువులోగా అందరూ పనులు మొదలు పెట్టి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

* బ్రహ్మకుమారి విశ్వశాంతి కేంద్రం నెక్కల్లు దగ్గర 10 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. వచ్చే నెల ఒకటో తేదీన శంకుస్థాపనకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

* 22అంతస్తులుగా ఎస్‌బీఐభవనాన్ని నిర్మించనున్నారు.

* మార్చిలో హెల్త్‌సిటీ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, అక్టోబరు నాటికి చిన్న క్లినిక్‌ ప్రారంభిస్తామని ఇండో-యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి సంతృప్తి చెందలేదు. అంతకంటే పెద్ద స్థాయిలో ఆసుపత్రి ప్రారంభించాలని సూచించారు.

* ఏప్రిల్‌ రెండోవారంలో నిర్వహించే అర్బన్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆలోచనాపరులు, విధాన రూపకర్తలు, వినూత్న ఆవిష్కర్తలు, టెక్నాలజీని వినియోగించుకుని అత్యున్నత విజయాలు సాధిస్తున్న యువతను దీనికి ఆహ్వానించాలని, పట్టణ ప్రణాళిక, సాంకేతికతకు సంబంధించిన ఆలోచనల కలబోతకు ఇదో అంతర్జాతీయ వేదిక కావాలని అధికారులను ఆదేశించారు.

45 ఎకరాల్లో కళా గ్రామం

రాష్ట్రంలోని కళలకు, సంస్కృతికి అద్దం పట్టేలా రాజధాని అమరావతిలో ‘కళాగ్రామం’ నిర్మించనున్నారు. నదీ తీరంలో సుమారు 45 ఎకరాల్లో ఇది ఏర్పాటవుతుంది. కృష్ణా కరకట్టకు నదికి మధ్యలో 15 ఎకరాలు, కరకట్టకు ఇటు పక్క 30 ఎకరాలు కలిపి మొత్తం 45 ఎకరాల్లో కళా గ్రామం అభివృద్ధి చేస్తారు. నది పక్కనే ఉన్న 15 ఎకరాల్లో ఎక్కువగా హరిత వనాల్ని ఏర్పాటు చేస్తారు. 30 ఎకరాల్లో 1800-2000 మంది కూర్చునేందుకు వీలుగా ఎన్టీఆర్‌ కళా వేదిక (బహుళ ప్రయోజనకర ఆడిటోరియం), అమ్యూజ్‌మెంట్‌ పార్కు, ప్రదర్శన కేంద్రం, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, ఫుడ్‌కోర్డులు వంటివి నిర్మిస్తారు. కి.మీ. పొడవైన గోడ నిర్మించి… దాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల చరిత్రకు, సంస్కృతికి, కళలకు దర్పణం పట్టేలా చిత్రాలతో తీర్చిదిద్దాలన్న ప్రతిపాదన ఉంది. కళా గ్రామానికి సంబంధించి సీఆర్‌డీఏ రూపొందించిన ప్రణాళికను ముఖ్యమంత్రి పరిశీలించారు. దీనిపై మరింత చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందామన్నారు.