అవసరాల బాబు ఎక్కడ?

0మొదటి సినిమా ఊహలు గుసగుసలాడేతో దర్శకుడిగా తన ప్రత్యేకత చాటుకున్న యాక్టర్ కం డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ అసలు ఏం చేయబోతున్నాడో అంతు చిక్కడం లేదు. రెండో సినిమా జ్యో అచ్యుతానంద సైతం మంచి విజయాన్ని దక్కించుకున్నప్పటికీ మూడో ది మాత్రం ఇప్పటి దాకా మొదలు పెట్టలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు మొత్తం మూడు సినిమాలు వారాహి బ్యానర్ లోనే చేయడానికి గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్న అవసరాల అది ఎంతకీ పట్టాలు ఎక్కకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతున్నాడు.

అష్టా చెమ్మ టైం నుంచి తనకు బెస్ట్ ఫ్రెండ్ గా మారిన నానితో త్వరలోనే ఒక సినిమా చేస్తానని ప్రకటించిన అవసరాల దాని గురించి మాట్లాడ్డం లేదు. మరోవైపు నాని కొత్త ప్రాజెక్ట్స్ కి వరసబెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. జెర్సి దర్శకుడు గౌతమ్ కు ఓకే చెప్పడానికి నాని తీసుకుంది కేవలం నెల రోజులే. మరి అవసరాల లాంటి అనుభవం ఉన్న దర్శకుడు ఫ్రెండ్ విషయంలో మాత్రం ఎందుకు జాప్యం చేస్తున్నాడన్న కారణం ఆ ఇద్దరికీ మాత్రమే తెలుసు. నిజానికి అవసరాల తన మూడో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి వారాహి సంస్థ చుట్టే ప్రదక్షిణాలు చేస్తున్నాడట. ఆ బ్యానర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ రెండూ తనవే కావడం కూడా అక్కడే ఇరుక్కుపోయేలా చేసింది. సో అవసరాల అవసరం నెక్స్ట్ ఏంటి అనేది అంతు చిక్కడం లేదు.

ఆ మధ్య బాబు బాగా బిజీతో సోలో హీరోగా చేసిన ట్రయిల్ వర్క్ అవుట్ కాకపోవడంతో కొంచెం ప్రాధాన్యం ఉన్న చిన్న వేషాలకు కూడా అవసరాల ఓకే చెబుతున్నాడు. నాని ఇతని డైరెక్షన్ లో ఓకే చేయడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఒకవేళ చేసినా అది వారాహి బ్యానర్ లోనే చేయాలి. అందుకు నాని ఒప్పుకుంటాడా అంటే డౌటే. ఈ సందిగ్ధంలోనే పుణ్య కాలం కాస్తా గడిచిపోతున్నట్టు ఉంది. సెన్సిబుల్ స్టోరీస్ ని బాగా డీల్ చేయగలడు అని పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ ఇలా కాల యాపన చేస్తూ పోతే రెండేళ్లకు ఒక సినిమా రావడం కూడా కష్టమే. కాస్త అవసరం పెంచుకుంటే బెటరేమో.