జగన్‌పై అయ్యన్న షాకింగ్ కామెంట్స్

0Ayyannapatrudu-lashes-at-ysఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి వారసత్వంగా కోట్లాది అవినీతి సొమ్ము వచ్చిందని ఆరోపించారు.

బుధవారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ.. జగన్ మీడియాలో ప్రతిరోజు తప్పుడు వార్తలే కనబడతాయని అన్నారు. విశాఖపట్నం భూముల గురించి వస్తోన్న ఆ వార్దలను అక్కడి ప్రజలు నమ్మి ఆందోళన చెందుతున్నారని అయ్యన్నపాత్రుడు అన్నారు. 2009 నుంచీ విశాఖలో భూకుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పారు.

మేఘ మథనం పేరుతో డబ్బులు తిన్నవారు నేడు అవినీతి గురించి మాట్లాడటం హాస్యస్పదమని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఎవరినీ వదిలిపెట్టవద్దనే సీఎం చంద్రబాబునాయుడు విశాఖ భూకుంభకోణంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించారని చెప్పారు.

ఆ భూముల వ్యవహారంలో ఆధారాలుంటే తమ ముందు పెట్టాలని, వాటిపైతాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేగానీ, అసత్య ప్రచారాలు మాత్రం చేయవద్దని అయ్యన్నపాత్రుడు.. జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు. విచారణను తప్పుదోవ పట్టించేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహా ధర్నాకు సిద్ధమైందని మండిపడ్డారు.