బాహుబలి2 సినిమా సెన్సార్ పూర్తి

0Baahubali-2-censor-Reviewటాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ బాహుబలి ది కంక్లూజన్. ఈ నెల 28న బాహుబలి2 విడుదల చేయనుండగా.. ఇప్పుడీ మూవీ తెలుగు వెర్షన్ కు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 17న బాహుబలి2 మూవీకి సెన్సార్ పూర్తి చేశారట యూనిట్. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాజమౌళి అండ్ టీం చేయలేదు. సెన్సార్ పై కనీసం సమాచారం కూడా బయటకు చెప్పలేదు. అయితే.. బాహుబలి2కి మాత్రం సెన్సార్ అయిపోయిందని.. వారి నుంచి యూ/ఏ సర్టిఫికేట్ అందుకున్నారని తెలుస్తోంది. మొదటి భాగం కంటే ఎన్నో రెట్లు అద్భుతంగా బాహుబలి2 ఉండనుందిట. 250 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ రెండో భాగం.. టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో కొత్త రికార్డులను నమోదు చేయనుందనే టాక్ వినిపిస్తోంది. అయితే.. బాహుబలి2 సెన్సార్ విషయాన్ని బైటకు చెప్పకపోవడానికి వేరే కారణం ఉందంటున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు.. తమిళ్.. మలయాళం.. హిందీల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఆయా భాషల సెన్సార్ బోర్డుల నుంచి క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారట. అన్నీ వచ్చేసిన తర్వాత.. ఒకేసారి గ్రాండ్ గా అనౌన్స్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. రిలీజ్ కు మరో 10 రోజులు మాత్రమే ఉండనుండడంతో.. ఈ వారం చివరికల్లా యూఎస్ తో పాటు ఇతర దేశాలు ప్రింట్స్ ను పంపించనున్నారు.