బాహుబలి 2 ఫ్యాన్స్‌కి నిరాశ

0Baahubali-2బాహుబలి 2 సినిమాను ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ఇంతకాలం ఓపిగ్గా వేచిచూసిన తమిళనాడు ఫ్యాన్స్ తీరా సినిమా రిలీజైన రోజే తీవ్ర నిరాశకి గురయ్యారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకుందామని తెల్లవారుజామునే థియేటర్లకి పరిగెత్తుకొచ్చిన ఆడియెన్స్‌కి మార్నింగ్ షో రద్దు అయినట్టుగా తమిళనాడులోని అన్ని థియేటర్ల బయట కనిపించిన నోటీసు బోర్డులు చిరాకెత్తించాయి. కొన్ని థియేటర్ల వద్ద ఆందోళనకి దిగిన ఫ్యాన్స్ థియేటర్లపై దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అభిమానులని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. చెన్నైలోని రోహిని థియేటర్ వద్ద జరిగిన ఘర్షణలో ఇద్దరు అభిమానులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీల వివాదమే ఈ పరిస్థితికి కారణమైంది. “ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారికి షో క్యాన్సిల్ అయిన విషయాన్ని మెస్సేజ్ ద్వారా సమాచారం అందిస్తే బాగుండేది. తమకి ఇక్కడి వరకు వచ్చి టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం వుండేది కాదు. అలా తమకి సమాచారం ఇవ్వకపోగా ఇప్పటివరకు టికెట్ డబ్బులు కూడా వెనక్కి తిరిగి ఇవ్వలేదు” అని ఆగ్రహం వ్యక్తంచేశారు ఓ అభిమాని. తమిళనాడులో ఉదయం 11 గంటల వరకు ఎక్కడా షోలు మొదలవకపోవడం అక్కడి అభిమానులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు.