జపాన్లో ‘బాహుబలి’ క్రేజ్ తగ్గలా..

0‘బాహుబలి’ ఇండియన్ ఆడియన్స్ ను మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. అందులో జపనీయులు కూడా ఉన్నారు. ఆ దేశ ప్రేక్షకులు ఈ సినిమాకు మామూలుగా కనెక్టవ్వలేదు. థియేటర్లలో ‘బాహుబలి’ చూస్తూ వాళ్లు చేసిన సందడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘బాహుబలి’ మెర్చండైజ్ కు అక్కడ వస్తున్న రెస్పాన్స్ చూసి అందరూ షాకైపోయారు. ‘ది కంక్లూజన్’ వంద రోజుల ప్రదర్శన పూర్తయిన సందర్భంగా దర్శకుడు రాజమౌళి.. నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్ కు వెళ్తే వారికి బ్రహ్మరథం పట్టారు అక్కడి జనాలు.

ఇటీవలే సుబ్బరాజు అక్కడికి వెళ్తే అతడికీ అపూర్వ స్వాగతం లభించింది. ‘ది కంక్లూజన్’ రిలీజై ఐదు నెలలు దాటుతున్నా అక్కడ ఈ సినిమా మేనియా ఇంకా తగ్గట్లేదు. థియేటర్లలో ఇప్పటికీ ‘బాహుబలి’ ఆడుతుండటం విశేషం. ప్రధాన థియేటర్లలో బాహుబలి సినిమాలోని కీలక పాత్రల స్టాండీల్ని కూడా ఏర్పాటు చేసి సినిమాను నడిపిస్తుండటం విశేషం. అక్కడ ఒక థియేటర్లో ఏర్పాటు చేసిన బాహుబలి.. భల్లాలదేవల స్టాండీలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వీటి వెనుకే ‘బాహుబలి’ ప్రీక్వెల్ ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ పుస్తకం.. తాజాగా లాంచ్ చేసిన బాహుబలి మాంగా బుక్ కు సంబంధించిన ప్రచార చిత్రాల్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక ఇండియన్ సినిమా మరో దేశంలో ఈ స్థాయిలో క్రేజ్ సంపాదించుకోవడం అనూహ్యమైన విషయం. మళ్లీ ఇంకే ఇండియన్ సినిమాకు కూడా జపాన్ లో ఈ స్థాయి క్రేజ్ చూడలేమేమో.