కౌశల్ ఆర్మీపై బాబు షాకింగ్ కామెంట్స్!

0బిగ్ బాస్-2 క్లైమాక్స్ కు చేరుకున్న కొద్ది అనూహ్య పరిణామాలతో రసవత్తరంగా మారుతోంది. ఈ సీజన్ ముగింపునకు వస్తోన్న తరుణంలో మసాలా డోస్ ఎక్కువవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గీతా మాధురి ముద్దుల టాస్క్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దాంతో పాటు – ఈ షో వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని మానవ హక్కుల కమిషన్ (హెచ్ ఆర్ సీ)లో ఫిర్యాదు కూడా నమోదైంది. మరోవైపు ఈ సీజన్ లో కౌశల్ విన్నర్ గా నిలుస్తాడని…లేదంటే ధర్నాలు జరిగిపోతాయని యాంకర్ రష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ కు హేతువాది బాబు గోగినేని మరో షాకిచ్చారు. కౌశల్ ఆర్మీపై బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆర్మీతో కౌశల్ ముందుగానే డీల్ పెట్టుకొని షోకు వచ్చాడని బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు యాంకర్ శ్యామల కూడా బయట డీల్ మాట్లాడుకుని వచ్చిందని బాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఆర్మీ అయితే పాకిస్థాన్ – ఇండియా బోర్డర్ లో యుద్ధం చేయాలని….ఓ రియాలిటీ షో కోసం సోషల్ మీడియాలో ఆర్మీఅంటూ ఇంత హంగామా ఏమిటని బాబు మండిపడ్డారు. ఆ ఆర్మీతో కచ్చితంగా డీల్ పెట్టుకుని కౌశల్ హౌస్ లోకి వచ్చాడని బాబు అన్నారు. కౌశల్ మోడలింగ్ లో వ్యాపారంలో రాణిస్తున్నాడని – తన మేనేజర్ బాగా పనిచేస్తున్నాడని కౌశల్ తనతో అన్నాడని బాబు గుర్తు చేసుకున్నారు. తన భార్య రెండు వారాల్లో చాలా చేయబోతోందని చెప్పాడని – ఆ ఆర్మీ గురించి ఆ మాట అని ఉంటాడని ఇపుడు అనిపిస్తోందని బాబు అన్నారు. శ్యామల కూడా ఎలిమినేట్ అయిన తర్వాత బయట అన్ని విషయాలు సెట్ చేసుకుని హౌస్ లోకి వచ్చారని చెప్పారు. హౌస్ లోకి వెళ్లిన వారు చాలా మందితో డీల్ కుదుర్చుకున్నారని ఓ ఛానల్ హెడ్ తనతో చెప్పాడని బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.

వైల్డ్ కార్డు ఎంట్రీకి కూడా తాను వ్యతిరేకమని అలా వచ్చిన వారికి బయట అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. ఎలిమినేట్ అయి రీఎంట్రీ ఇచ్చిన వారు బయటి విషయాలను తమకు నచ్చిన వారితో చర్చించడం తాను చూశానని అన్నారు. కౌశల్ ఓ మోడల్ అని….అయితే ఇంతమంది అభిమానులున్నారని తాను అనుకోవడం లేదని అన్నారు. నిజ జీవితంలో కౌశల్ ఏకైన అభిమాని నాని అంటూ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌస్ లో కౌశల్ తప్పు చేసినా నాని పట్టించుకోకపోవడం….సరైన విధానం కాదని బాబు అన్నారు.మరి బాబు తాజా వ్యాఖ్యలపై కౌశల్ ఆర్మీ రియాక్షన్ ఏవిధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.