బాబు గోగినేనికి షాక్..బిగ్ బాస్ కు నోటీసులు?

0ప్రముఖ హేతువాది బాబు గోగినేని పై కొద్ది రోజుల క్రితం మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. గోగినేని పై దేశ ద్రోహంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆధార్ చట్టాన్నిగోగినేని ఉల్లంఘించారని – ఔత్సాహికుల ఆధార్ సమాచారాన్ని సేకరిస్తున్నారని కేవీ నారాయణతో పాటు మరికొందరు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా హేతువాద ప్రచారం కోసం నిధులు దుర్వినియోగ పరుస్తున్నారని ఆరోపించారు. గోగినేని సేకరించిన ఆధార్ సమాచారాన్ని తమ సంస్థల ద్వారా విదేశాలకు అందజేస్తున్నారనిదాని వల్ల దేశ భద్రతకు కూడా భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ – బెంగళూరు – విశాఖలో నిర్వహించిన ఈవెంట్లలో పాల్గొన్న వారి ఆధార్ సమాచారాన్ని గోగినేని….నెట్ లో పెట్టారని కేసు పెట్టారు. అయితే ఆ కేసు పెట్టినా….బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఓ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో లో పాల్గొంటోన్న గోగినేనికి నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

బిగ్బాస్ తెలుగు రియాల్టీ షో నిర్వాహకులకు గోగినేనికి సంబంధించిన నోటీసులను మాదాపూర్ పోలీసులు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఆ నోటీసులు అందుకున్న 48 గంటలలోపు బాబు గోగినేని వివరణ ఇవ్వవలసి ఉంటుందని తెలుస్తోంది. బాబు గోగినేని పై చర్యలు తీసుకోలేదని హైకోర్టును ఓ పిటిషనర్ ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై కోర్టు స్పందించింది. ఈనెల 25లోపు బాబు గోగినేని కేసు పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని సైబరాబాద్ పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం బాబు గోగినేనిపై దేశ ద్రోహం – మత విశ్వాసాలను అవమానించడం – అనుచిత ప్రచారంతో పాటు ఆధార్ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం పలు కేసులు నమోదు చేశారు. అయితే బిగ్ బాస్ షో లో ఉన్నందున బాబు గోగినేని బయటకు వెళ్లే అవకాశం లేదు. కానీ గతంలో డ్రగ్స్ కేసు విచారణకు అప్పటి బిగ్ బాస్ హౌజ్ మేట్ ముమైత్ ఖాన్ ….సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అదే తరహాలో బిగ్ బాస్ ప్రతినిధితో కలిసి బాబు గోగినేని బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.